Saturday, January 06, 2018

మధుమేహం గురించి ఎందుకు తెలుసుకోవాలి ?

మధుమేహం గురించి ఎందుకు తెలుసుకోవాలి ?


మధుమేహం సాధారణంగా కనిపించే వ్యాధి. ఎవరికైనా ఉండవచ్చు. మన దేశంలో క్రమంగా మారుతున్న వాతావరణ పరిస్థితులు, పారిశ్రామికీకరణ, నగరీ కరణ, ప్రజల జీవనవిధానాలలో మార్పులు. ఇలా అనేక అంశాలతోపాటు మధుమేహపు కేసులు కూడా పెరుగుతున్నాయి.
దురదృష్టవశాత్తూ వ్యాధిగ్రస్తుల్లో 50 శాతం మందికి తమకు మధుమేహం ఉన్నట్టు తెలియదు. ఇప్పుడు మన దేశంలో జరిగే మరణాలకు మధుమేహం ఒక ప్రధాన కారణమైంది. అవగాహనా లోపం దీనికి కారణం
మధుమేహానికి గురి కావడం సాధారణంగా మన చేతుల్లో లేకపోయినప్పటికీ, దానిని అదుపులో ఉంచుకోవడం మాత్రం మన చేతుల్లోనే ఉంది.
ఎక్కువ మోతాదులో మూత్రం (మేహం) వెళుతుంది. కనుక దీనికి ప్రమేహ మని పేరు, మూత్రం చక్కెరతో (మధు) కలిసి విసర్జితమవుతుంది కనుక దీనికి మధుమేహమని పేరు వచ్చింది. దీనిలో అతి-మూత్రత (మూత్రం ఎక్కువ మోతాదులో రావడం), అవిల - మూత్రత (మూత్రం చిక్కగా రావడం) వంటివి ఉంటాయి. డయాబెటిస్' అనేది గ్రీకు పదం. ప్రవహించడమని దీనికి అర్థం. అలాగే "మెల్లిటస్ అనేది లాటిన్ పదం. తేనె అని అర్థం. డయాబెటిస్ మెల్లిటస్ అంటే తేనె వంటి ద్రవం శరీరం నుంచి ప్రవహించడమని అర్థం.. ఈ పాంక్రియాస్ ఇన్సులిన్ ను పూర్తిస్థాయిలో విడుదల చేయలేకపోవడంతో రక్తంలో ఉన్న చక్కెర నిల్వలు కణజాలాలలోకి వెళ్లలేవు. దీనితో శరీరానికి రావలసిన శక్తి అందకపోగా, గుండె, మూత్రపిండాల వంటి ప్రధాన అంతర్గత అవయవాల మీద అదనపు వత్తిడి పడుతుంది. ఈ విధంగా మధుమేహమూ, దానిని అనుసరించి అన్ని అవయవాలకు ఇక్కట్లు వస్తాయి
మధుమేహం ప్రధానంగా రెండు రకాలనీ, వంశపారంపర్యత మొదలైన సహజ కారణాల చేత వచ్చేది మొదటి రకమనీ, అపథ్యాలైన ఆహార విహారాలను పాటించడం వలన సంక్రమించేది రెండవ రకమనీ పేర్కొన్నారు.
 టైప్ 1 డయాబెటిస్ /మొదటి రకాన్ని ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్ లేదా జువనైల్ డయాబెటిస్ అని
టైప్ 2డయాబెటిస్/ రెండవ రకాన్ని నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్ లేదా మెచ్యూరీటి ఆన్ సెట్ డయాబెటిస్‌ అని కూడా వ్యవహరించేవారు
మధుమేహం వ్యాధి ఇటీవల కాలంలో మన దేశంలో బాగా పెరిగినట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ మన దేశంలో అగ్రగామిగా ఉందని, హైదరాబాద్ మధుమేహ నగరంగా ముందుందని తెలుస్తుంది,
చాప క్రింద నీరులా మధుమేహం వ్యాప్తి జరుగుతుంది. ప్రపంచానికే మధుమేహ రాజధానిగా మనదేశం ప్రసిద్ధికెక్కింది. సుమారుగా 50 మిలియన్లకు పైగా ఇప్పటికే మన దేశంలో మధుమేహం బారిన పడ్డారు. ఈ సంఖ్య 2030 నాటికి 80-100 మిలియన్లకు పెరగ వచ్చని ఒక అంచనా,
దురదృష్టం కొద్ది మధుమేహ వ్యాధి లక్షణాలు  కొత్తలో అంతగా ఇబ్బంది పెట్టేవి కాదు. అందుకే దానిని అంతగా పట్టించుకోము. నష్టం జరిగిన తరువాత గాని నిజ స్వరూపం బయటపడదు. కాబట్టే దానిని సైలెంట్ కిల్లర్" అంటారు. మధుమేహం ఉన్నదని మధుమేహం ఉన్న వాళ్ళకు 50% మందికి తెలీనే తెలియదు, తెలుసుకున్న వాళ్ళల్లో 50% మంది మాత్రమే తగిన వైద్యాన్ని తీసుకొంటున్నారు.
మధుమేహం వలన నరాలు, గుండె, ఊపిరితిత్తులు, రక్తనాళాలు, మూత్రపిండాలు, కళ్ళ, పాదాల లాంటి ఎన్నో అవయవాలు దెబ్బతింటాయి. కాబట్టి మధు మేహం గురించి అందరు తప్పక తెలుసుకొని దాని నుంచి రక్షణ పొందాలి

No comments: