చాపకింద నీరులా శరీరాన్ని చుట్టబెట్టే ఒక పెను ఉపద్రవం. దీనికి పేరులోనే తీపి. ఒకసారి షుగర్ జబ్బు బారిన పడితే ఇక జీవితమంతా చేదే. తల నుంచి కాలి గోటి దాకా శరీరం మొత్తాన్ని వ్యాధుల కుంపటిలా మార్చేస్తుంది. అందుకే మధుమేహం అంటేనే నేడు ప్రపంచం ఉలిక్కిపడుతోంది. డయాబెటిస్ కేపిటల్ గా మారుతోన్న మన దేశంలో మధుమేహం ఇప్పటికే తన విశ్వరూపాన్ని చూపిస్తోంది. ఈ తీపి జబ్బుతో ఉన్న చిక్కేమిటంటే నిత్యం మందులు, ఇన్సులిన్ వాడుతూ దీన్ని అదుపులో ఉంచుకోవడమేగానీ ఇప్పటిదాకా దీనికి శాశ్వత చికిత్స అంటూ ఏదీ లేదు. అయితే షుగర్ జబ్బు ఉన్నంత మాత్రాన భయపడాల్సిన పని లేదు. ఆధునిక వైద్యంలో ఇవాళ మధుమేహానికి చక్కటి మందులు అందుబాటులో ఉన్నాయి. ఓవైపు మందుల మింగుతూ; మరోవైపు చక్కటి ఆహార నియమాలను పాటిస్తూ, నిత్యం శరీరానికి చాలినంత శ్రమను కల్పించుకోవడం ద్వారా మధుమేహంతో ఎలాంటి ప్రమాదం లేకుండా నిశ్చింతగా సహజీవనం చేయొచ్చు.

ఆహారం, శారీరక వ్యాయామం…

 ఈ రెండే మధుమేహులకు తారకమంత్రాలు. అయితే షుగర్ జబ్బు ఉన్నపుడు ఏం తినాలో, ఏం తినకూడదో అన్న అనుమానాలు చాలామందిని వేధిస్తుంటాయి. అన్నం మానేస్తారు. ఒట్టి చపాతీలనే తీసుకుంటారు. స్వీట్లు, తీపి పదార్థాలకు, చివరికి పండ్లకు కూడా దూరంగా ఉంటుంటారు. నిజానికి షుగర్ జబ్బుకు ఇన్ని పథ్యాలు పాటించాల్సిన అవసరం లేదు. అన్నాన్ని మానాల్సిన పని లేదు. బియ్యాన్ని పాలీష్ పట్టించకుండా వండుకోవచ్చు. గోధుమలు, రాగులు, సజ్జలు ,జొన్నలు వంటి చిరు ధాన్యాలను, కాయగూరలను, ఆకుకూరలను ఎక్కువగా తినాలి. వేళకు భోజనం చేయాలి. విందులు, ఉపవాసాలు వద్దేవద్దు. నిమ్మ, దానిమ్మ, ఉసిరి, ద్రాక్ష, జామ, బొప్పాయి, యాపిల్‌ వంటి పండ్లు మధుమేహాన్ని చక్కగా అదుపులో ఉంచుతాయి. వీటిని తరచూ తీసుకోవాలి. ఉదయం పూట రాగి మాల్ట్ ని తాగడం ఎంతో మేలు చేస్తుంది. ఇక మెంతులయితే మధుమేహులకు నిజంగా వరమే. నిత్యం ఏదో ఒక రూపంలో మెంతుల్ని తీసుకోవడాన్ని అలవాటు చేసుకుంటే చాలు.. ఒంట్లో షుగర్ జబ్బు చక్కగా అదుపులో ఉంటుంది. అలాగే నిత్యం 30 నిమిషాలకు మించి నడక, జాగింగ్, ఈత, లేదా ఏదో వ్యాయామాన్ని అలవాటు చేసుకోవాలి. చాలినంత శ్రమను కల్పించుకుంటే మన ఒంట్లో ఇన్సులిన్ వినియోగం చక్కగా ఉంటుంది. తద్వారా షుగర్ జబ్బు కూడా చక్కగా అదుపులో ఉంటుంది.
మధుమేహం… నియంత్రణలో ఉంటేనే మనకు నిబ్బరం.
 అదుపు తప్పితో ఆపాదమస్తకం అల్లకల్లోలం.
 కళ్లెం వేయకపోతే ఒళ్లంతా కబళిస్తుంది. 
దుర్భేధ్యమైన రక్షణ వ్యవస్థను సైతం బీటలు వారుస్తుంది.
 కంటి నుంచి కాలి గోటి దాకా ఆపాదమస్తకం గుల్ల చేస్తుంది.
 ఏళ్ల కొద్దీ మధుమేహంతో బాధపడుతున్నపుడు…
 కంటి చూపు,
 కాలి పాదాలు
, రక్త నాళాల గోడలు,
 నాడీ వ్యవస్థ,
 కిడ్నీలు, 
గుండె, 
మెదడు…
 ఇలా ప్రతి అవయవమూ షుగర్ దాడికి బలవుతుంది
. షుగర్ ధాటికి ముఖ్యంగా మనలోని నాడీ వ్యవస్థ రోజురోజుకీ కుదేలయిపోతుంటుంది. అన్నిటికీ మించి కాళ్లలోని నాడులు దెబ్బతినిపోతాయి. 
ఫలితంగా స్పర్శా జానం తగ్గిపోతుంది. దీంతో కాళ్లకు దెబ్బ తగిలినా, కాళ్ల మీద పుండు పడినా మధుమేహులకు నొప్పి, బాధ సరిగా తెలియవు. నొప్పి, బాధలు లేకపోవడంతో చికిత్స తీసుకోకుండా అశ్రద్ధ చేస్తారు. చివరికి కాళ్లపై, పాదాలపై పుండ్లు ఎంతకీ తగ్గని రాచపుండ్లలాగా మారతాయి. ఈ ఉపద్రవాల్ని,  ఇన్ఫెక్షన్ల తాకిడిని నివారించుకునేందుకు ఎపుడూ అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా పాదాల సంరక్షణలో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి.   
మధుమేహం… నివురు గప్పిన నిప్పులాంటిది. ఆదమరిస్తే ఆపదల్ని కొని తెచ్చుకున్నట్టే అవుతుంది. షుగర్ విషయంలో నిరంతర అప్రమత్తతే మనకు శ్రీరామ రక్ష.. నిత్యం మందుల సాయం తీసుకుంటూ, మరోవైపు ఆహార, వ్యాయామాల సాయంతో ఒంట్లో షుగర్ జబ్బుని ఎపుడూ నియత్రణలో ఉంచుకోవాలి. రక్తంలో గ్లూకోజు తీరుతెన్నులు ఎలా ఉంటున్నాయన్న విషయాన్ని తరచూ పరీక్షల సాయంతో తెలుసుకుంటూ ఉండాలి. మధుమేహులు ప్రతి ఒక్కరూ ఏబీసీ సూత్రాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఏ అంటే ఏ1సి, బి అంటే బ్లడ్ ప్రెజర్, సి అంటే కొలెస్ట్రాల్… ఈ మూడు పరీక్షల్ని తరచూ చేయించుకుంటూ ఉండాలి. అపుడే షుగర్ జబ్బు నియంత్రణలో ఉందా? అదుపు తప్పుతోందా? ఇతరత్రా జాగ్రత్తలేమైనా తీసుకోవాలా అన్న విషయం మనకు తెలుస్తుంది. బరువు విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలి. అధిక బరువు, స్థూలకాయం ఉన్నపుడు షుగర్ ని నియంత్రణ లో ఉంచుకోవడం చాలా కష్టసాధ్యంగా ఉంటుంది. కాబట్టి ఒంట్లో షుగర్ జబ్బు ఉన్నపుడు తప్పనిసరిగా బరువును అదుపులో ఉంచుకోవాలి.
మధుమేహం… ఇపుడెంత మాత్రం మొండి జబ్బు కాదు. వైద్య రంగంలో ఎప్పటికప్పుడు మన ముందుకొస్తున్న సరికొత్త మందులు, చికిత్స విధానాలు షుగర్ జబ్బును చాలా చక్కగా నియంత్రణలో ఉంచుకునేందుకు తోడ్పడుతున్నాయి. ఒకప్పటితో పోలిస్తే షుగర్ జబ్బును గుర్తించడం, చికిత్స విషయంలో ఇటీవలి కాలంలో అనేక మార్పులు వచ్చాయి. ఒకప్పుడు గుప్పెళ్ల కొద్దీ మందులు మింగాల్సి వచ్చేది. మందుల మోతాదు కూడా ఎక్కువగానే ఉంటుంది. మందుల సమర్ధత కూడా అంతంత మాత్రంగానే ఉండేది. అయితే నేడు
 డీపీపీ4,
 జీఎల్ పీ అనలాగ్స్;
 ఇంజెక్టబుల్ సింథటిక్ హార్మోన్;
 కాంబినేషన్ డ్రగ్స్ 
వంటి చక్కటి మందులు ఇవాళ మనకు  అందుబాటులోకి వచ్చాయి.
 ఇన్సులిన్ పంపులు
 కూడా ఇపుడిపుడే వాడుకలోకి వస్తున్నాయి
. బరువును తగ్గించడం ద్వారా కూడా మధుమేహాన్ని అదుపులో ఉంచగలమన్న సరి కొత్త చికిత్స పద్ధతులు కూడా ఇపుడిపుడే పురుడు పోసుకుంటున్నాయి
. స్టెమ్ సెల్ థెరపీస్; 
జీన్ థెరపీ వంటి చికిత్సలు
 సాకారమైతే మధుమేహాన్ని శాశ్వతంగా నయం చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయని నిపుణులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

మధుమేహం…నిజానికి జీవన శైలి జబ్బు.
. గతి తప్పిన ఆహారపు అలవాట్లు, కనుమరుగైన శారీరక శ్రమ, శృతి మించిన ఒత్తిళ్లు, ఆందోళనలు… వెరసి గజిబిజిగా మారిన జీవనశైలి పుణ్యమా అన్ని ఈ తీపి జబ్బు మనపై పంజా విసురుతోంది. తినే ఆహారం, చేసే వ్యాయామం, ఒత్తిళ్ల విషయంలో కాస్తంత జాగ్రత్తపడితే షుగర్ జబ్బుకు కళ్లెం వేయొచ్చు. ఇప్పటికే కుటుంబంలో షుగర్ బాధితులు ఉంటే క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. రక్తంలో షుగర్ 100 దాటినా, 110 కి చేరువైనా… షుగర్ ముప్పు పొంచి ఉందని గుర్తించాలి. కనీసం ఈ దశలో జాగ్రత్తలు తీసుకున్నా కొన్నేళ్ల పాటు మనం షుగర్ జబ్బుని వాయిదా వేసుకోవచ్చు.