శ్రీశ్రీశ్రీ వీరబ్రహ్మేంద్రస్వాములవారి సంపూర్ణ జీవితచరిత్ర
జవంగులనాగభూషణదాసు
ప్రథమ ప్రకరణము
14. వీరంభొట్ల యాచార్యస్వామి బాల్యము
16. వీరంభొట్లయ్య తల్లికి విరక్తి మార్గము బోధించుట.
17. వీరంభొట్లయ్య తల్లికి పిండోత్పత్తి క్రమము బోధించుట.
18. వీరంభొట్లయ్య జీవుని "చతుర్దశ" లక్షణములివని తల్లికి బోధించుట.
19. వీరంభొట్లయ్య తల్లికి "సాంఖ్యంబును" బోధించుట.
20. వీరభోట్లయ్య తల్లికి తారకోపదేశంబు చేయుట.
ద్వితీయ ప్రకరణము
30. వీరప్పయ్య గారు అచ్చమ్మగారికి కాలజ్ఞానమును బోధించుట
చతుర్ధ ప్రకరణము
సప్తమ ప్రకరణము
66. శ్రీ స్వాముల వారు సిద్దయ్య గారికి సాంఖ్య యోగంబును బోధించుట
ద్వాదశ ప్రకరణము
107. శ్రీ స్వాములవారు ఎరుక యిట్టిదని తెల్పి దాని ప్రభావంబును బోధించి, పిమ్మట పరిపూర్ణంబును బోధించుట
పుస్తక ప్రతులకు చిరునామా:
జవంగుల నాగభూషణదాసు సన్స్
శ్రీ వీరబ్రహ్మేంద్రాశ్రమము
సత్తెనపల్లి - 522403
ఆంధ్రప్రదేశ్ - ఇండియా
14. వీరంభొట్ల యాచార్యస్వామి బాల్యము
శ్రీ వీరపాపమాంబకు సంతానంబు లేమిచే పేదవానికి లభించిన పెన్నిధి చందంబున ప్రేమచే నతి గారాబంబున భార్యాభర్తలిరువురు నతని బెంచుచుండిరి. అబ్బాలుండును దినదిన ప్రవర్ధమాన రాకా శశాంకుని భంగి పెద్దవాడగుచుండెను. ఇబ్బాలుఁడు పిన్న తనంబు నుండియు పెద్దవారు నేర్పినట్లుగా పద్మాసనంబు వేసికొని కూర్చుండును. ఎప్పుడును మౌనముగా నుండును. వీరంభొట్లయాచార్యస్వామికి సప్త వార్షికంబులు రాగానే పాఠశాలకవిపి సర్వవిద్యలు నేర్పించిరి. పాఠశాల యందుండు బాలు రందరకన్నను నన్ని విద్యలయందును మిగుల జ్ఞానవంతుడాయెను. వీరంభొట్లయ్య పదు నాలుగు విద్యలయందు ఉత్తీర్ణుండాయెను.
అంతలో పెంపుడు తండ్రియైన యనమదల వీరభోజయాచార్యులు జీవబ్రహ్మైక్యసిద్ధింజెందిరి. అంత నా వీరపాపమాంబ భర్తృవియోగంబుచే గల్గిన దు:ఖంబునకు మేరగానక తానును ఈ లోకంబు వీడిపోవలెనని తలంచెను. కాని వీరంభొట్లయ్య యందుండెడి ప్రేమచే తాను దలంచిన కృత్యంబును వీడెను. అట్లే దు:ఖించుచు భర్తకు పరలోక క్రియ లొనరించి, వీరంభొట్లయ్య యందు గల ప్రేమచే కాలమంతయు పుత్రుని జూచుకొనుచు గడుపుచుండెను. ఆ వీరంభొట్లయ్య అన్ని విద్యలయందు నుత్తీర్ణుం డగుటచే విజ్ఞానవంతుడై వైరాగ్యంబున మనంబున గలిగిన దు:ఖంబునకుం గారణంబు సంసారంబని మదినెంచి దానిని వదలి ఆవరణ విక్షేపకారణంబులైన మాయావిద్యలను చిత్తంబునకు నంటనీక మౌనీంద్రుల వ్యాపారంబుల బొంది సర్వ క్షేత్రంబులను సేవించవలెనను వైరాగ్యంబు గలిగి తల్లికడ కేగి ఇట్టులనియె
6. వీరంభొట్లయ్య తల్లికి విరక్తి మార్గము బోధించుట
"తల్లీ! ఏమియు నెఱుంగని యజ్ఞానివలె సత్యంబెరిగిన సద్గుణ శాలివైన నీవే యిట్లు ప్రాపంచిక భ్రాంతిని విడజాలక యిట్లు కుంగుచుండుట న్యాయమా? జననీ, ఈ అజ్ఞానంబును చాలించుము. మనుజునకు ఈ జన్మమందును బూర్వమందును పరమందును విచారించగా కర్మబంధము వలన కల్గిన తల్లిదండ్రులు, పుత్రులు, పుత్రికలు, భార్యలు, భర్తలు నెందరో గలరు గదా! వారందరును నీటిపైన గల్గిన బుద్బుదము వంటి వారనియును, దేహములు నిట్టివే యనియును నెరుంగవలెను. ఇవి మాయచే బుట్టినను అజ్ఞానులైన మనుజులు శరీరము నిత్యమనియు, నీ సంసారమే శాశ్వతమనియు మాయచేత కట్టువడి శరీర సంబంధమైన దారాపుత్రాదులు చూచుచుండగనే మరణించినను, అహంకార మమకారములచేత తమ సంబంధులైన పుత్ర పుత్రికాదులు మరణించినను, బుద్దియందు నెక్కువైన అరిషడ్వర్గంబుల ననేక విధంబులుగా విస్తరింప జేసికొని, కామముచేత తమకు యే గతి గలుగునోయని తెలియలేక స్త్రీలనే వలలో బడి పక్షులవలె లేవలేక, యీషణత్రయములను సముద్రంబులో మునిగి, ఆలుబిడ్డలందు మమకారంబు ఎక్కువై, వారికొరకై యనేక కష్టంబుల బొంది, తదకు వారివలన లేశమాత్రంబైన సుఖంబును బడయనేరక, కాలంబంతయు నీ రీతి గడిపి శరీరము పడిపోవుకాలమందు యమునిచే ననేక బాదలొంది, నరక కూపంబున కొన్ని నాళ్ళుండి పాపాత్ములై పుట్టుచు జచ్చుచు ననేక బాధలు పొందుచున్నారలు. తల్లీ! సకల సద్గుణ కల్పవల్లీ! నేను బోధించుచున్న యీ వాక్యంబులను త్రికరణశుద్ధిగా వినుచుండుము. ఈ శరీరమును నమ్మబోకుము. శరీరంబులు శాశ్వతంబులు గావు. ఈ యేహ్యంబైన శరీరంబులోనున్న పరమాత్మ నెరుంగుము. ఈ శరీరము మాంసము నెత్తురు ప్రేగులు చర్మము మల మూత్రములు కలదై వుండును. ఈ శరీరంబును ప్రత్యేకంబుగా జూచినప్పుడు అసహ్యము గల్గును. వీని కన్నింటికిని స్థానంబైన దేహం బిట్టిదని తెలియజాలక కుటిలులై ఈ సంసారమందు మునిగిపోవుచున్న వారలు. నీవన నెవ్వరో నేనన నెవ్వరో బాగుగా నీ మనంబుననే యోచించి చూచిన నీకే బోధపడు" నని వీరంభొట్లయ్య తల్లియైన వీరపాపమాంబకు దెల్పగా నామెయు విజ్ఞాని యగుటచే మారాడుటకు నోరాడక కుమారుని జూచి "నాయనా! ఇట్టి యేహ్యంబైన యీ శరీరంబు యీ ప్రపంచమందు బుట్టుటకు మూల్యమైన 'పిండోత్పత్తిని' మీ తండ్రి నా కిదివరలో ననేక విధంబులుగా జెప్పియున్నారుగానీ నీవును అది యే విధంబుగా నున్నదో నాకు తెలియునట్లు తేటతెల్లముగా బోధింపు"మని వేడిన తల్లితో కుమారుండిట్లనియె -
17. తల్లికి కుమారుండు "పిండోత్పత్తి" క్రమంబును బోధించుట
"తల్లీ! నే జెప్పబోవు ఈ పిండోత్పత్తి క్రమంబును చక్కగా వినుము. శ్రుతి:|| అన్నాద్మే*జాయతే, మేదాన్మాంస: మాంసాద్రక్త: రక్తాద్రేత: రేతసో మోహ:" శ్రుతి:|| శుక్లశోణితాదావర్ధతేగర్భ: స్త్రీరేతోతిరిక్తాత్ స్త్రీయోభవతి, పురుషరేతో రక్తాత్పురుషోభవతి, ఉభయోర్బీజతుల్యాన్నపుంసకోభవతి, వ్యాకులిత మనసా: ఖంజా, కుబ్జా వామనాదిరూపా భవతి, ఏకరాత్రేణస్ఖలితం భవతి, పంచరాత్రేణ బుద్బుదం భవతి, మాసేన శిర: మాసద్యయేన కర పాదాదాయ:, షష్ఠిఅఘ్రయస్కందయశ్చక్ష్చూంషి, సప్తమే మాసేజీవోభవతి, నవమాష్టమయోర్జన్మాంతర స్మృతిర్భవతి, యదియోన్యాం, ప్రముచ్యేతతం ప్రసుధ్యే మహేశ్వరం, యది యోన్యాం ప్రముచ్యేత యోగ్యం, సాంఖ్యం, సమాశ్రయే. నానా యోని సహస్రాణిజాతాని వివిధానిచ| భుక్తాశ్చ వివిధాహారంపీతాశ్చ వివిధాస్త్శసా:! ఏకందు:ఖం సమావిష్టం వైష్ణవీ మాయా అవిశతి భూమౌ పతతి. తా|| మనుజుండు భుజించిన యన్నము మూడు భాగంబులుగా నుండును. కనబడు భాగము స్థూలమనియు, దాని మధ్యయందుండు జిహ్వకు తెలియురసము సూక్ష్మమనియును దాని యందుండు సత్తువు అణువనియును చెప్పబడును. భుజించు అన్నము, ఉదకము, నెయ్యి మొదలగు పదార్థములు కలిసి శరీరమునకు మదమును, ప్రాణమునకు చేష్టా సమర్ధతయు, మనసునకు దార్ఢ్యమును గలుగజేయును. వీనిలో మద మతిశయించినపుడు పురుషునకు శుక్లమును, స్త్రీకి శోణితమును వృద్ధియై భార్యా భర్తలకు ఋతుకాలమందు సంగమము గలిగినపుడు శుక్ల మధికమునపుడు పురుషుండును, శోణిత మధికమైనపుడు స్త్రీయును, రెండు సమానమైనపుడు నపుంసకుడును గలుగును. ఒకసారి రతిచేసి కామము తీరక వెంటనే రతిచేసినయెడల శుక్లశోణితమలయొక్క యెక్కువ తక్కువలనుసరించి ఒక స్త్రీ ఒక పురుషుడుగాని, లేక ఇద్దరు స్త్రీలుగాని, ఇద్దరు పురుషులుగాని కలుగుదురు. ఇవియునుంగాక యోనికమలమునందు కొందరికి పొరలుండిపడిన శుక్లము ఆ పొరలయందు విభజింపబడి పైన చెప్పిన విదమున కవల పిల్లలు పుట్టుదురు. యోనికమలమందు పొరలుండుట చేతనే పందులు, కుక్కలు, పిల్లులు మొదలయిన జంతువులకు రెండేసి, మూడేసి, నాలుగేసి పిల్లలు పుట్టును. ఇదియునుంగాక స్త్రీ స్నానంబుచేసినది మొదలు పదియారు దినములు ఋతుకాలమని చెప్పంబడును. అందులో మొదటి మూడు, నాలుగు దినంబులు సంగమంబునకు నిషేదములు. నాల్గవ దినమందు రతిసల్పిన పిచ్చివాండ్రును, అపరిశుద్ధులును, శాస్త్రవిశ్వాసము లేనివారును పుట్టుదురు. అయిదవ దినము మొదలు తక్కిన పండ్రెండు దినములలో రతికి పదకొండు, పదమూడు దినంబులు నిషేధంబులు. బేసి దినములయందు పురుషుండుపుట్టును పగలు పిండోత్త్పత్తియైన యెడల దరిద్రుడు, అర్థాయువు గలవాడు, పెద్దలను దూషించువాడు పుట్టును. ఋతుకాల మందు రతిజేయుదినములలో మంచి పదార్థములను భుజించి దేవతా గురుపూజలు చేసి పుత్రకామేష్టి యందు జెప్పబడిన ప్రకారము కొన్ని క్రియలు జేసి రతి చేసిన యెడల యోగ్యమైన సంతానము కలుగును. ఒకనాటి రాత్రి శుక్లము పడును. ఇది శోణితముతో గలిసి ఐదు దినంబులు నీటిపై బుగ్గవలెనుండును. పది దినంబులకు కోడిగ్రుడ్డువలె నుండును. నెలకు గట్టిపిండమై శిరస్సు ఏర్పడును. రెండు నెలలకు కాళ్ళు చేతులును, మూడు నెలలకు కడుపును, నాలుగు నెలలకు నిరు పార్శ్వంబులును, ఐదు నెలలకు పాదములు వ్రేళ్ళును ఏర్పడును. ఆరవ నెలయందు ముక్కు, చెవులు, కన్నులు మొదలయిన రంధ్రములు గల అవయవములు కలుగును. ఈ విధముగ నేర్పడిన దేహమందు ఏడవనెల యందు జీవుడు ప్రవేశించును. అప్పుడు ఊర్ధ్వముఖమై యుండును. నాభి మొదలుకొని బ్రహ్మరంధ్రము వరకు వెనుక భాగమందు చిన్న రంధ్రముగల యొక నాడి యుండును. అప్పుడు తల్లి యొక్క జఠరాగ్ని బాధ లేకుండునట్లు సూతియను పేరుగల యొక తొడుగు పిండమును జుట్టి యుండును. ఎనిమిదబ తొమ్మిదవ నెలలయందు పూర్వజ్ఞానము గలిగి, భూమిమీద పుట్టేవరకు మలమూత్ర స్థానమైన గర్భమందు నిలిచి, తనలో తానిట్లని దు:ఖించును. 'అయ్యో, నెను జన్మాంతరములయందు కొంచెమైన పుణ్యంబు చేయకపోతిని, ప్రపంచానుభవము దెలిసి యుండియు నన్ను ఎవడు ఏమనును అనెడి గర్వంబుతో సత్కర్మలు చేయకపోతిని. ఒకానొకప్పుడు పరులను వంచించుటకై కామ్యకర్మలను జేసితిని, నిష్కామ కర్మలను జెవినిబెట్టక మనసునందు విచారింపక పెద్దలు చెప్పినప్పుడు నా యిష్టము వచ్చినట్లు నేను చేయుదును అని వారలను నిందించుచు సద్గతిని విచారింపక పోతిని. అజ్ఞానముచేత స్వస్త్రీ (అనగా భార్య)యందు నిషిద్ధ దినముల నాలోచింపక, పగలు అనియైన విచారింపక రతిసుఖంబులు బొందితిని. పర స్త్రీలను మోహించి అన్యాయముగా వారిని జెరచితిని. చిన్నతనపు బుద్ధివలన అనేక పాపంబులు చేసితిని. గురువులను, పెద్దలను, తల్లిదండ్రులను దూషించి నీను అను ఏక వచన ప్రయోగంబు చేసితిని. శరీరము పడిపోవునది యని తెలిసినప్పటికిని కూటసాక్ష్యములచేత ధనము నార్జించితిని. ఆ ధనము భార్యా బిడ్డల కొసంగి మరల వారు ఇవ్వనందున దు:ఖించితిని. ఇట్లు పూర్వజ్ఞానంబుచే గర్భంబున నున్న శిశువు దు:ఖించుచు దిక్కు యెవరని విచారించుచు గర్భము నుండి పుట్టిన తర్వాత నైనను జ్ఞానము దెచ్చుకొని సద్గురువు యొక్క పాదపద్మము లాశ్రయించి సాంఖ్య, యోగ, భక్తి మార్గములచేత పరమాత్మ ధ్యానము చేయగలను. ఈ మలమూత్ర దుర్గంధ యుతమైన నరకకూపము నుండి విడిచిన పిమ్మట బాహ్యమందు అంతరమందు సగుణ నిర్గుణ పూజలు చేయుదును. ఇంకను పరమాత్మను మరువననియు ఈ మూత్రద్వారము నుండి ఎప్పుడు విడువబడుదునని విచారించుచుండగా, అంత విష్ణుమాయ గప్పి పిండము అధోముఖమై తల్లికి బాధ గలిగించుచు భూమిమీద, తల్లి యొక్క అపాన వాయు ప్రసారముచేతను పిండమందుండు ప్రాణాది వాయు ప్రసారము చేతను పడును. అప్పుడు అక్కడ నుండువారు మగశిశువా? ఆడశిశువా? అని విచారింతురు. మగశిశువేనా ? మంచిది అని కొందరును, ఆడశిశువా? అదీ మంచిదేయని మరికొందరు నిట్లనుకొనుచు కలినీళ్ళు చల్లుదురు. అప్పుడు పూర్వవృత్తాంతంబు మరచి 'కావురు'మని యేడ్చును.
18. వీరంభొట్లయ్య జీవుని "చతుర్దశ" లక్షణములివని తల్లికి బోధించుట
ఆ శిశువున కెంత మాత్రమును జ్ఞానము లేక, మంచము మీద బడి మలమూత్రములలో నుండి కదలలేక, ఈగలను, దోమలను తోలుకొనలేక విశేషముగా దు:ఖించును, అప్పుడు గర్భము నందుండు దోషములన్నింటిని దాటి యింత వరకు వచ్చినప్పటికీ కిసరులు, పోరులు, సంధులు మొదలయిన రోగంబులను, ముట్టు దోషంబులను అనుభవించుచు వాటికి తల్లిదండ్రులు ప్రతిక్రియలు సేయునప్పుడు ఔషధ పానము చేయలేక దు:ఖించుచు, ప్రతి నెలయందు బాలగ్రహముచేత బాధనొందుచు, పరమాత్మాను గ్రహము చేత నాలుగైదు వత్సరములు గడచి అక్షరాభ్యాసము చేయబడి ఉపాధ్యాయులు చెప్పినట్టు చదువలేక దెబ్బలుపడుచు, ఈ విధంబున పదునెనిమిది వత్సరముల వరకు వృద్ధిపొందుచుండగా, తల్లిదండ్రులు ఒక చిన్నదానిని తెచ్చి వివాహము చేయుదురు. ఆ భార్యయందు యుక్తా యుక్త సమయములు తెలియక రతి చేసి సంతానంబుగని, వారికి సంరక్షణ చేయలేక, రాజులు మొదలగువారి సేవలు చేయుచు నేను సంపాదించి యిందరి పిల్లలను సంరక్షణచేసి పెండ్లి మొదలగు శుభకార్యంబులు చేయుచున్నానని గర్వించి తన కన్న బలహీనుల బాధింపుచు ద్రవ్య సంపాదనమే ముఖ్యమని మిక్కిలి యాశతో ద్రవ్యమునుదెచ్చి ఎప్పుడును పరమాత్మను దలంపక కాలమును గడుపుచుండగా కొన్ని దినములకు వృద్ధత్వంబువచ్చి చెవులు, కన్నులు, పాదములు, చేతులు మొదలగు నవయవములు వాని వాని వ్యాపారములను జేయజాలక యున్నప్పుడు మొదట భార్యను బిలిచి తనను లేవనెత్తుమని అడుగగా వారందరును అక్కడనుండుము, అక్కడనేయుండు మని యనగా, నేను వీరి ననేక విధంబుల సంరక్షణము చేసితిని, నన్ను సుఖముగా సంరక్షణ చేయువా రెవ్వరు? అని ప్రయోజనము లేని వాక్యములను పలుకుచుండగా, యమ దూతలు వచ్చి గట్టిగా ప్రాణములను బంధించి ముండ్లు, రాళ్ళు మొదలగు కఠినంపు త్రోవలందు నడిపించుచు పోవు సమయంబున భయపడి "నెను ఎంత మోసపోతిని" అని దు:ఖమును బొందుచు, యమలోకంబున కేగిన పిమ్మట యమదండన మను నరకంబున బడ వైచి యట్టిది యని చెప్పుటకు నలవిగాని బాధను అనుభవింపజేయుచుండగా విశేషముగా నా జీవుండు దు:ఖపడును. కనుక తల్లీ! యిట్టి పాంచ భౌతికంబైన యీ శరీరంబు పై నాశవదలి, సదా సచ్చిదానంద స్వరూపుడగు సర్వేశ్వరుని సర్వకాల సర్వావస్థల యందును ధ్యానించుచుండు మని బోధించుచున్న కుమారునిజూచి "కుమారా! నీవు బోధించిన 'పిండోత్పత్తి' క్రమంబును మానవుడనుభవించెడి "చతుర్దశ" లక్షణములును నాకు చక్కగా బోధపడినవి. ఈ శరీరంబెట్లు గల్గెనో బోదింపు" మన కుమారుం డిట్టులనియెను -
19. వీరంభొట్లయ్య తల్లికి "సాంఖ్యంబును" బోధించుట
తల్లీ! ఈ శరీరంబు ఏయే తత్వంబులచే నుత్పత్తి యగుచున్నదో తెల్పెద స్థిరచిత్తవై వినుము.
ఓం, హ్రీం, క్లీం, శ్రీం, శివాయ బ్రహ్మణే నమ:
[ బొమ్మ ]
శ్లో|| ఓంకారే దేవీ వదనం వాయుకార భుజద్వయం |
వికారం దేహమభ్యంచ నమకార భుజ ద్వయం ||
శ్లో|| అవ్యక్తోమమతోహంకార: ఆత్మానాకాశ సంభూత: |
ఆకాశాద్వాయు: వాయురోరగ్ని:, అగ్నేర్ అప: అప: పృధివి:
ఇట్లు పంచభూతములుగల్గెను. పృథివి, జలము, అగ్ని, వాయువు, ఆకాశంబు లను నీ పంచభూతములచే శరీరంబాయెను. ఈ పంచభూతంబులు వేరు వేరుగా విభజించబడుటయే పంచీకరణం బనబడును. అది యెట్లన -
- మనోబుద్ధి చిత్తాహంకారము లనెడు అంత:కరణ చతుష్టయము నాకాశంబుచే గల్గెను.
- సమానవ్యాన ఉదాన అపాన ప్రాణంబులనెడు పంచ ప్రాణంబులు వాయు భూతంబులచే గల్గెను.
- శ్రోతము, త్వక్కు, చక్షువు, జిహ్వ, ఘ్రాణంబులనెడు జ్ఞానేంద్రియములు అగ్నిభూతంబు లచే గల్గెను.
- శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము అనియెడు పంచతన్మాత్రలు జలభూతంబులచేగల్గెను.
- వాక్కు, పాణి, పాదము, గుదము, గూహ్యంబు లనెడు కర్మేంద్రియంబులు పృధ్వీభూతంబుచే గల్గెను.
ఈ పంచభూత పంచతన్మాత్రలు పంచీకృతంబులైన సకలేంద్రియంబులును. తదీయ వికారంబులు, సత్వ రజోతమంబులనెడు త్రిగుణంబులును, స్థూల, సూక్ష్మ కారణ శరీరంబులును, కామక్రోధ లోభమోహ మదమాత్సర్యంబు లనెడు అరిషడ్వర్గంబులును వీటి యన్నింటితోనుండెడు 'జీవుం'డను కానని విక్షేపావరణంబును త్యజించి తనకు తానై తరచి విచారించి మున్ను జెప్పబడిన భూతాది వికారముల మీద తాను శేషించి యచలుడై యుండుటే సాంఖ్యమనంబడును, అనగా పంచవింశయుతండైన జీవుండు ఆ జీవుని యెరుంగుటే ఆత్మయనంబడును. ఆ యాత్మ వలన పరమాత్మనుగనుగొనినపరబ్రహ్మంబొక్కడే నిలుచునని తల్లికి నీ సాంఖ్యసూత్రం బెరిగించగా నంత తల్లియైన వీరపాపమాంబ సంతోష స్వాంతయై 'బిడ్డా! ఆ పరబ్రహ్మంబును కనుగొను నుపాయంబును దెల్పు'మనగా నంత వీరంభొట్లయ్య 'తల్లీ! ఇంక నా పరబ్రహ్మంబును నెరుంగు సాధనంబులను దెల్పెద. సావధానచిత్తవై విను'మని ఇట్లనియెను. (సిద్దయ్యగారికి బోధించిన సాంఖ్యంబును చూడుడు)
20. వీరభోట్లయ్య తల్లికి తారకోపదేశంబు చేయుట
తల్లీ! నీవా పరబ్రహ్మంబు నెరుంగుటకు అతి సుళువైన యోగమార్గంబుజూపించెద స్థిరచిత్తవై వినుము. జననీ నీవు పద్మాసనంబున స్థిరచిత్తంబున గూర్చుండి పవనంబు కన్నను బహురెట్లు వేగంబుగా పరుంగిడెడు "మనంబును" పరుగిడనీయక నేనిపుడు చూపించుచున్న నా విద్యుల్లేఖయందు మనంబును లయంబుచేసిన చిన్మయరూపుడై శ్రీ గురుమూర్తి కానంబడును. అదియే "ఆణువు". ఆ యణువునందే కోటి సూర్యప్రకాశంబులు పుట్టినవి. దీనియందే సర్వలోకంబును బుట్టి దీనియందే లయించును. ఆ ప్రకారమే శుద్దస్ఫటిక పరిపూర్ణపరమ పదము పిమ్మట అజ్ఞానంబను నువ్వులను శ్రీ గురునామోచ్చారణంబను కల్వంబున వైచి మర్దించి జ్ఞానంబనియెడినూనెదీసి కనుగ్రుడ్డు అనే ప్రమిదయందా నూనె పోసి జీవభ్రాంతియనెడి వత్తిజేసి నిర్వికారంబను నగ్నిచే వత్తిని వెలిగించి యాకోటి సూర్యప్రకాశంబైన నిర్వికారములో జేరి అచలంబను నానంద వారధిని మునింగి తరించుమని బోధించగా నంత నా వీరపాపమాంబ కుండెడి ఆనందమునకు మేర లేక ఈతండు నాకు ఋత్రుండని మరియుచుంటినేగాని నిజముగా నిప్పుడు విచారింపగా నా పరమేశ్వరుండే యిటు మానవ రూపుండై అంతరించినట్లు తోచుచున్నది. ఈయనను నా కొసంగి పెంచుకొనుమని చెప్పినప్పుడే ఇతండు 'భగవత్స్వరూపుండని' నా యత్రి మునీంద్రుడు చెప్పియే ఇచ్చెను. పుత్రమోహంబున మరచి సామాన్య మానవుండని తలంచితినే గాని కేవల పరబ్రహ్మావతారుండని తలంచక నిట్లు ప్రాపంచిక భ్రాంతిలో మునిగి కాలంబంతయు వ్యర్థంబు జేసికొంటినే యని కొంతసేపు మనంబున దలంచి కుమారుని తన తొడపై గూర్చుండబెట్టుకొని చక్కిళ్లు ముద్దాడి ముంగురులందువ్వుచు తనలో తానానందించుచు పరవశమై కుమారుని గడ్డంబు పట్టుకొని, కుమారా! నీవు మా పూర్వ పుణ్య వశంబున పుత్రుండవుగా నుండిన నిన్ను నేనేమని కొనియాడగలను. నీ వెవండైనది నిన్ను ఆరు మాసంబులు పెంచిన అత్రిమునీంద్రుడే చెప్పెనుగాని మా దురదృష్టవశంబున పుత్ర భ్రాంతిలోబడి నిన్ను కనుగొనలేక యిట్లు కాలమంతయు వ్యర్థంబు చేసిన దానను. కావున తండ్రీ! ఇక నాకున్న కొలది సందేహమును గూడ తీర్చుము. బిడ్డా! నీవు సాంఖ్యతారకంబులు బోధించుట చేత భ్రాంతికి మూలమైన నా సకల సంకల్పంబులు దహించెను. ఇది వరకు మీ తండ్రిచే విని కనియుంటివి గాని ఇట్లు "సూక్ష్మంబులో మోక్షంబును" జూపి యుండలేదు. ఇప్పుడు నీ బోధచే "త్రుప్పుపట్టిన కత్తికి తిరిగి పదును బెట్టినయట్లు" చేసితివి. ఇంక పరిపూర్ణంబును బోధించి ఐక్య సంధానంబు దెల్పుమని వేడుకొనగా నంత తల్లి తొడపై గూర్చుండియున్న వీరంభొట్లయ్య తన తల్లితో నిట్లనియెను. (సిద్ధయ్యగారికి బోదించిన తారకయోగంబును చూడుడు).
21. వీరంభొట్లయ్య తల్లికి అమనస్కంబును బోధించిన పదప విశ్వరూప సందర్శనంబు జూపుట. తల్లి కుమారుని స్తోత్రంబు చేయుట.
తల్లీ వినుము. నీ కా పరిపూర్ణబోదచేసెద. నీ నేత్ర కవాటంబును బంధించి లక్ష్యంబున నెక్కించి తరువాత దీపముభంగి కదులుచుండెడి మనంబును కదలనివ్వక నీలో నీవు చూచి సర్వావస్థల యందును బంచేంద్రియములకు గోచరంబగు సర్వంబును సచ్చిదానంద స్వరూపం బని యెరింగి బాహ్యాంతర ప్రపంచము మిథ్యగాజూచుచు '"సర్వం ఖల్విదం బ్రహ్మ' అను నార్యోక్తి ననుసరించి సర్వంబును బ్రహ్మమయంబని యెరుంగుము. తన స్వస్వరూపంబైన బ్రహ్మంబును నెరింగిన వారలే ముక్తులగుదురు. నీవు ఐక్యసంధానం బెరింగి తరింపు మన నంత వీరపాపమాంబ సంతోషాయత్తచిత్తయై "తండ్రీ! మాయనెరుంగ నే నెంతదానను. నా యజ్ఞానంబున నిన్ను కొమరుండ వను భ్రాంతిచే భావించి నీ నిజతత్వం బెరుంగక కేవల మూఢత్వంబున నుండి యింత కాలంబు ప్రవర్తించితిని. నిన్ను మా కొసంగిన ఆత్రి మునీంద్రుడే నీవు కేవల 'స్వయంభూ' వని యన్నో విధంబుల దెల్పిన విషయంబులన్నియు మరచితిని. నీవు విశ్వరూపకుండవైన సాక్షాత్ శ్రీ విరాడ్విశ్వకర్మ మహాప్రభుండవే గాని సామాన్య మానవుండవుగావు. సర్వాత్మవైన నీ వింక నీ మాయ నా యందు ప్రజ్వరిల్లం జేయక నన్ను నీ భక్తురాలినిగ కటాక్షించి రక్షింపుమని వినుతిజేయుచున్న తల్లిని జూచి వీరంభొట్లయాచార్యస్వామి తల్లీ! నీ వొక్క నిముషంబు నీ నేత్రద్వయంబును మూసికొనుమని చెప్ప ఆ యమ్మ అట్లే నేత్రంబులను మూసి తెరచువరకా వీరంభొట్లు విశ్వరూపంబునుం దాల్చి, వేయి మస్తకంబులును, వేయి పాదంబులతో బ్రహ్మాండ భాండమంతయు తానెయై పాదంబులు పాతాళ లోకంబై, సస్తక.....
27. వీరప్పయాచార్యులు సర్వక్షేత్రములు సేవించి బనగానపల్లెకు జేరి గరిమరెడ్డి అచ్చమ్మగారింట కాలజ్ఞానమును వ్రాయుట
శ్రీ వీరప్పయ్యగారు హరిహరపురము నుండి బయలుదేరి హంపి, విరూపాక్షం, అహోబిలం, మహానంది, ఓంకారం బాదిగా గల పుణ్యక్షేత్రంబులు సేవించుకొని బనగానపల్లె చేరి ఆ గ్రామమంతయు దిరిగి గరిమరెడ్డి అచ్చమ్మగారి ఇంటికిజేరెను. సాయం సమయమగుటచే నారాత్రి యంతయు నామె యింటి ముందరనన్న గుట్టపై పరుండియుండెను. ఆయనను పలుకరించిన వారెవరను లేరయిరి. తెల్లవారగానే అచ్చమ్మగారు బైటకు వచ్చి గుమ్మము ముందర పిచ్చివానివలె కూర్చొనియున్న వీరప్పయాచారిగారిని చూచి, వీని యాకారమా పిచ్చివానివలె నున్నది. ఈయన ముఖంబు జూచిన మహా తేజోవంతముగా నున్నది. ఈతం డెవరైన నేమి? అని వీరప్పయాచార్యులవద్దకునేగి నిలుచుండి నాయనా! నీ యూరెద్ది? నీ నామంబెయ్యది? తల్లిదండ్రులెవరు? ఇచట నుండుటకు కారణంబేమని అచ్చమ్మగా రడుగగా నంత వీరప్పయ్యగారు తల్లీ! నా యూరిపేరు బ్రహ్మాండపురం. నా నామము వీరప్పయాచార్యులు. నా తల్లిదండ్రులెవరో నాకు దెలియదు. నాక ఒక చోటని నియమము లేదు. నేనెప్పటికిని ఒంటరిగానే యుందును. నీ దర్శనార్దినై వచ్చితిని గాని యా సర్వంబు నేనై యున్ననని చెప్పగా, నే మెయు సుజ్ఞానియైనను అంత దూరదృష్టి ఆలోచనపోక, నాయనా! నీవెందులకై నాకడ కరుదెంచిత వనగా, నా వీరప్పయాచారి గారు అమ్మా! నా చిన్నతనంబు నుండియు నాలమందలను గాయుచు వాటి క్షీరములనే ఆహారంఉగా గైకొనుచు, నా గోవులకు వొచ్చెడి జబ్బులను నయమ చేయుచు నుండెడి వాడను. ఇప్పుడు నీ యింట నాలమంద లనేకంబు లున్నవని తెలిసి యటకరుదెంచితిని. నాచే గోవులను గాయించుకొని నిచ్చయుండెనెని మీరు నాకు పట్టెడు బోజనము మాత్రము మూటగట్టి యిచ్చుచుండుడు. నాకెక్కుడు గోక్షీరంబులపై యిచ్చగలవాడను గాన నీ యింటను మాత్రము అన్నంబు భోజనము చేయనని చెప్పగా నీయన నోటినుండి వెలువడుచున్న విషయంబు లన్నియు కేవల షట్చాస్త్ర పారంగతుడైనను మాట్లాడజాలని వని అచ్చమ్మగారికి తోచి ఆమె యిట్టులనియెను. "నాయనా! నీవు భీకరారణ్యంబులలోని కేగక నీ గ్రామము ప్రక్కన నున్న 'రవ్వలకొండ' పైని యావులను మేపుకొనుచు నీ గ్రామంబునకు మధ్యనున్న జుఱ్ఱేటి యందు నీరంబులను ద్రాపుకొనుచు సాయం సమయమున నా గోవుల నిల్లు చేర్చుచుండుము. బిడ్డా! నీకు పదునారు వత్సంబులైన లేకున్నవి. నీవు పసిడిచేష్టలచే పోకిరి పిల్లల సహవాసంబు చేయక బుద్ధిగానున్న నా యింట నీకేమియు కొరతలేదని చెప్పగా నంత వీరప్పయ్యాచార్యులు "తల్లీ భీకరారణ్యంబున నేమియు భయముండదు. తొల్లి గోపాలకృష్ణుండు గోవులను గాయుచు పదునాల్గు వేల గోపికాలోలుండై యుండి భూభారంబెట్లు దీర్చెనో అట్లే నేనును నీ యింటనుండి నీ ఆలమందలను గాయుచు గోపాలకుండనై యీ కలికాల మనుజుల కుండు అజ్ఞానంబును అంధత్వంబును బాపి సుజ్ఞానం బను వెలుంగు జూపి పతితులను పావనులనుగా చేయువాడ" నని చెప్పగా అచ్చమ్మగారీ పిచ్చివాని మాటల కేమని తలంచి యాయనను తన గృహంబులోనికి గొంపోయి పరుండుటకై వసతి చూపించి క్షీరంబులను గైకొని వచ్చి త్రాగుమని జెప్పి తన అంత:పురంబులోని కేగి భోజనంబును జేసి పరుండి యిట్లని ఆలోచింప దొడంగెను. మొదట నీ వెవరని అడిగితే బాలుండిచ్చిన జవాబును చూడ కేవలం భగవత్స్వరూపండని తోచుచున్నది. తిరిగి శ్రీ కృష్ణునకును తనకును భేధము లేనట్లుగా బల్కుచున్నాడు. ఈయన ముఖారవిందము చూచినప్పటి నుండియు నామనం బెందులకో మారి పోయినది. ఇది యంతయును జూడగా నొక చిత్రముగా గాన్పించుచున్నదని యాలోచింపుచు నిదురించెను. తెల్లవారగనే క్షీరంబులను త్రాగుమని అచ్చమ్మగారు వీరప్ప యాచారికి గారికి తెచ్చియిచ్చి రాగిసంకటిముద్దను మూటకట్టి నాయనా! యిదిగో అన్నపు మూట. ఈ గోవుల నెట్లు కాపాడెదవో యని యా యాలమందల నాయన స్వాధీనము చేసెను. అంత నాత డా గోవులను తోలుకుపోయి యొకచోట గుంపులుగా చేసి యా గోవుల చుట్టును నొక గీత గీసి తానొక తాడిచెట్టుకడ కేకగా నాచెట్టు సాంతముగా పడెనో యనునట్లు క్రిందికి వంగెను. అంత నా మహాభాగేయు డా తాడిచెట్టులోని మువ్వను గోసికొని గులజారి ముండ్లను తీసికొని, రవ్వలకొండి యందొక గుహ చూచుకొని, లోని కేగి యట గూర్చుండి యా తాటియాకులపైని గులకరి ముండ్లతో కాలజ్ఞానంబును వ్రాయుచుండెను. ప్రతి దినమును నిట్లె వ్రాయుచుండెను. తాను తినుటకై కట్టెడు అన్నపు మూటను నిత్యమును ఒక పాతరయందు వైచుచుండెను. వీరప్ప యాచారి వ్రాయు కాలజ్ఞానంబు లన్నియు అచ్చమ్మగారి యింట ప్రక్కనయున్న పాడు పాతరలోవైచి ఎవ్వరు చూడకుండ బండ మూయుచుండెను. ఆయన కాయుచున్న యాలమందలోని గోవు లన్నియు దినదిన ప్రవర్థమానముగా బెరుగుచుండెను. తోటి బాలురు గుట్టలన్నియు త్రిప్పుకొని బహు శ్రద్ధతో గాయుచున్న గోవులన్నియు నెప్పటియట్లే బక్కచిక్కియుండెను. ఒకానొక దినంబున నా గ్రామస్థులా దారినే వచ్చుచుండగా గుంపుగానున్న గోవులను జూచి యెవ్వరును లేకుండా గుంపుగానుండుటకు కారణంబేమైయుండునో యని వారంద రాలోచించుకొని ఈ గోవులను గాయు వారెవ్వరచ్చట లేనందున, నివి యన్నియు తప్పించుకొని యిటువచ్చి యుండవచ్చునని యా గోవులకడ కరుదెంచి వారందరును తోలగా నా గోవులన్నియు నెమరువేయుచు నట్లె గుంపుగా నుండెను. వారెన్ని ప్రయత్నంబులు జేసినను ఒక్కటైనను కాలు గదల్చకుండా అట్లె నిలువంబడియుండె. అంత వారికి విసుగుతోచి ఆ వీరప్పయాచార్యస్వాములవారు ఆవుల చుట్టు గీసిన గీత మీదుగా దాటి ఆవలకు వెళ్ళేసరికి వారి నేత్రంబులు కాన్పించక అంధులైరి. అంత వారి కేమియు దోచక మెల్లగా వారెట్లు గీత మీదుగా వచ్చిరో, అట్లె గీతమీదుగా వెనుకకు వచ్చువరకే వారి నేత్రంబులు యధావిధిగా గాన్పించుచుండెను. కాని గోవులు మాత్రము కదలక అట్లె గుంపుగా నుండెను. అంత నా గోవులెవ్వరివని వారు విచారించగా అచ్చమ్మ గారివని తెలిసి, యామె వద్ద కేగి యీ జరిగిన వృత్తాంతమంతయు వారు చెప్పగా నంత నామె కేమియు తోచక నాయనలారా! ఇక మీ రేగుడని చెప్పి, వీరు చెప్పిన వన్నియు యదార్థమో? కావో? ఏమియు తోచకున్నది. ఇది యంతయు నాలోచింపనేల? నేనే స్వయముగా నాయనకు కనబడకుండ నేగి కనుగొనియెదనని తలంచెను.
30. వీరప్పయ్య గారు అచ్చమ్మగారికి కాలజ్ఞానమును బోధించుట
తల్లీ! అచ్చమాంబా వినుము. 4808 సంవత్సరంబులు ఈ కలియుగంబులో జరిగిపోయిన పిమ్మట ధర్మదేవత భూలోకమందు పుణ్యస్థలంబులలో దిరుగుచుండును. పాపంబులు నానాటికి హెచ్చి ఎందునలేని కలహంబులు పుట్టును. అధిక ఆహారము, అధిక నిద్రగలిగి నిలిచిన తావున నిల్వక సమస్తమైన నరమృగాదులు సంచరించును. శాంత గుణము గల్గిన వారలు కోపవంతులయ్యెదరు. నీచులు అధికులగుదురు. అధికులు ఎందుకు కొరగాకుందురు. విప్రులు తమ తమ ధర్మంబులు విడచి మనిషి కొక్కొక్క మతమై నీచులనాశ్రయించి షట్కర్మరహితులై చెడిపోదురు. రాజులు తమ రాజ్యధర్మంబులను విడచి చోద్యవంతులై నీచ కార్యంబుల జొచ్చి దేశాలపాలగుదురు. తమ తమ కులంబులు వదలి అధర్మము చేత దుష్కర్ములై పోదురు. శూద్రులసత్యవాదులై నీచ సాంగత్యముచేత దరిద్రులై చెడిపోదురు. ప్రతిజాతియు సంకరంబై పరస్పర వైరంబులు హెచ్చి మతకలహంబువలన కొట్టుకొని మరణింతురు. దుష్కర్మలవలన బహువిధంబులైన కష్టంబులొంది చెడిపోదురు. పైర్లు కొంచెముగా ఫలించును. గోవులు కొంచెముగా పాలుపిండును. తండ్రీ కొడుకులు తమలో తాము వలహించేరు, దేవబ్రాహ్మణులను గురువులు దూషించేరు. వావివర్తనలు దప్పి నడిచేరు. ఒకరి సొమ్ము నొక రపహరించేరు. చోర, రోగ ఉపద్రవములు హెచ్చేను. అగ్ని భయంబులు అధికమయ్యేను. అడవి మృగంబులు గ్రామాదులలో చేరేను. ఏనుగునకు పందిపుట్టును. పందికి కోతిపుట్టును. పాపంబులు హెచ్చేను. వేశ్యల వశీకరణమువల్లను అంజనంబుల వల్లను ప్రజలు దురాశచేతను, భ్రమలచేతను ద్రవ్యంబులు కొల్లగొట్టి దరిద్రులై చెడిపోయేరు. ఇంద్రజాల వేదంబులను చండాలురు అభ్యసించేరు. చోళమండలము నష్టమయ్యేను. శిలలు కండలు గ్రక్కేను. ఆ కండలను తినుటకై గ్రద్దలు వచ్చి చచ్చేను. ఆ చచ్చినవాటిని బట్టుకొఇన ప్రజలు గంతులు వేసేరు. కొరువులు నోటగరచ్కొని తిరిగేరు. బెండ్లు మునిగేను. గండ్లు తేలేను. కొండలు మండేను. భూతగ్రహ చేష్టము లధికమయ్యెను. కడుపులో మంటలు పుట్టి చచ్చేరు. నోటియందు బొబ్బలుపుట్టి నెత్తురు గ్రక్కుచు గుండెలుపగిలి నడినెత్తి పగిలి చచ్చేరు. పశుమృగాదులు గుంపులుగా గూడి చచ్చేను. పట్నాలన్నియు నొకరేపాలించేరు. ఇతరదేశీయులు వచ్చి భారతఖండ మంతయు నొకరే పాలించేను. వారు పాలనమునకై వచ్చిన పిమ్మట మానవులే గాక చీమలతో సహా చదువు నేర్చుకొనేను. నవనాగరికత హెచ్చవును. విద్యాజ్ఞానంబు బలిసి వర్ణంబులన్నియు నొక్కటయ్యేను. అన్ని యుగంబులలోని పాలనకన్న నీ పాలనము జనానుకూలముగా ఉండేను. ఎద్దులు లేకండనే బండ్లు తోలేరు. మంచినీటిచేత దీపంబులు వెలిగించేరు. పులి, మేక ఒక రేవున నీరు త్రాగేను. ఊరూరను జనులు అన్యోన్య కలహంబులు బెట్టుకొని చచ్చేరు. వెంపలి మొక్కలకు నిచ్చెనలు వేసి ఎక్కెడెవారు బుట్టెదరు. తక్కువజాతివారు ఆచార వంతులైన బ్రాహ్మణులను, దేవ బ్రాహ్మణులను నింద చేసేరు. దేవ నిర్మాణ దేవతా ప్రతిష్ట దేవపూజలు చేయువారలు దరిద్రులై యుండేరు. విజయనగరము కొన్ని నాళ్ళు పూజనీయమైయుండి, కొన్ని దినంబులు చెడిపోయేను. కాశీపట్టణము నలుబది దినంబులు పాడుబడి యుండేను. కురుక్షేత్రమందు జనులు గుంపుగా కూడుకొని నరకులాడేరు. కొండవీడును విష్ణుభక్తు లేలేరు. గోదావరీ నదియందు ఉదకము పన్నెండు దినములు సమసిపోయేను. ఆవల యుప్పొంగేను. కాళహస్తీశ్వరుని సముఖ మందుండే ద్వారపాలకులు ఒక్క ముహూర్తములో గ్రుద్దులాడేరు. వేంకటేశ్వరుని కుడి భుజము అదరేను. మంగళగిరిలో మాయావాదులచే వైష్ణవులు కలహముచేత రెండు తెగలై యుద్ధమునకు గదిసేరు. కుక్కలు గుఱ్ఱాలను చంపేను. పగలు చుక్కలు కాన్పించేను. అందున కొన్ని గ్రామాదులలో జనులు నష్టమయ్యేరు. చుక్కలు రాలేను. కార్తీక బహుళ ద్వాదశి రోజున ఉత్తర భాగమున నాల్గు ముఖముల చుక్కలు బుట్టి, యిరవై అయిదు వారములు ప్రకాశించేను. కర్ణాటక దేశములో లక్ష్మి చలించేను. నిక్షేపమైన ద్రవ్యములు మహమ్మదీయులు కొంతకాల మపహరింపగా, ఆ మీదట వెలమరెడ్డి రాజులు కొంచెములో కొంచె మపహరించేను. మళయాళములో మందపాలుడు మనుజులతో మాటలాడేను. తిరుపతులకు పోవు మార్గాలు కట్టుబడేను. భూమి నెత్తురుచేత తడిసేను. ఎముకలు కొండల పొడవున పడేను. భూతప్రేత పిశాచాది గ్రహంబులు కోలాహలంబుగా నాడేను. అహోయని ప్రజలు అరచేరు. కాకులు వికార స్వరములచే అరచేను. నక్కలు ఝూము ఝూమునకు తప్పక నానాటికి హెచ్చుగా అరచేను. అందున కొందరు నష్టమయ్యేరు. కొండవీటి కుత్తరాన రాతి గరుడ స్తంభము ఊడిపడేను. అందున కొందరు జనులు నష్టమయ్యేరు. కలియుగము 5000 సంవత్సరముల మీదట కాశీలో గంగ కానరాకుండేను. కంచి కామాక్షమ్మ గిరగిర చక్రాకారముగా జాము తిరిగేను. బిళంకామాక్షమ్మ నెత్తురు గ్రక్కేను. వేపచెట్టున అమృతం కారేను. మాచర్లలోని రాజులందరు నొక మదవతిచే హతులైపోయేరు. ఆ మీదట మాచర్ల చెన్నకేశవస్వామి మహిమలన్నియు తగ్గిపోయేను. కారెంపూడిలో కలహములు పెంచుకొని అందున రాజులు హతమయ్యేరు. గాలివానలచేత శ్రీశైలమునకు దక్షిణమున గుండ్లు దొర్లేను, నెత్తురువాన కురిసేను. బండలు పగిలి ఆకాశమున గ్రద్దల వలెను, కాకుల వలెను ఆడేను. ఱాతి గుండ్లలో చీము, నెత్తురు వచ్చేను. మష్టు ఆరని బిడ్డలు మాట్లాడేరు. ఆకాశంబున పొగమంటలు పుట్టును. ఆరు మతములు వొక్కటయ్యేను. ఆహాయనే ధ్వనులచే బల్కేరు. ఆకాశమందు అర్ధరాత్రమందు ఘణా ఘణాం అని పదిగంటల రవంబులు బుట్టును. శంఖారవంబులు వినంబడేను. ఒకరి సొత్తు మరొక రపహరించేరు. ఒకరి ఆలు మఱొకరి పాలయ్యేను. పుణ్యవాదులు నా ప్రభావంబును తిప్పుకొనేరు. పుణ్యస్త్రీలు, పుణ్యపురుషులు బ్రతికేరు. పుణ్యస్థలంబులు చెడేను. దేవస్థానంబులు పాపాత్ములచేత నష్టమయ్యేను. నిక్షేపాలు బయలుపడేను. వెంకటాచలములో మహమ్మదీయులను చండాలురును పూజచేసేను. వేంకటేశ్వరుని సొమ్ము దోచేరు. ఈ దివ్యస్థలంబున నారగురు దుష్టులు బుట్టుదురు. తిరువళ్ళూరి వీరరాఘవస్వామికి తిరుమేనలు జేసేరు. అప్పుడు కుంభద్రోణములుగా చెమటలు బుట్టేను. కృష్ణా గోదావరీల మధ్య ఆవులు గుంపులు గుంపులుగా గూడి బహుగా చచ్చేను. ఒకరి నొకరు పట్టుకొని అడవులు పాలయ్యేరు. శీతోష్ణ జ్వరాలచే జనులు నశించేరు. కృష్ణానది మధ్యన బంగారు తేరు కనిపించేను. ఆ తేరుచూచిన వారికి కన్నులు కనబడకుండేను. ఆశ్వపతి సంస్థానము మంటపంబయ్యేను. కర్నాటక దేశము మహమ్మదీయ కాంతలచేత దేవాలయంబులు, శిలావిగ్రహంబులు విఘ్నమై పోయేను. శిలాధారణమైన తేరు లాకస్మికముగా విరిగిపడేను. దేవబ్రాహ్మణులు ఆచారశూన్యులై పోయేరు. వారికి తినుటకు తిండిలేక మాడుచుండేరు. శ్రీశైల భ్రమరాంబ సముఖమున రండుతలల బంగారుముసలి కనిపించేను. తిరిగి భ్రమరాంబలో ఐక్యమయ్యేను. చక్రాంకిత సంభవుడైన పరమహంసఉదయగిరి శిఖరాగ్రమందు అమావాస్యనాడు ఎక్కినప్రజల చంద్రగ్రహణమని బ్రమసేరు. శివ వైష్ణవ దేవళంబులలో రక్తంబు బుట్టును. ఆకాశంబునుండి రెండు బంగారుహంసలు వచ్చి పురములయందు, వనములయందు, నదులయందును సంచరించేను. పాపాత్ములయిన ప్రజలు చూచి పట్టెదమని పోయి కన్నులుగానక గిరగిర తిరిగి లక్షోప లక్షలుగ చచ్చేరు. తూర్పునుండి పడమర వరకు ఆకాశంబున యోజన ప్రమాణము వెడల్పుగా చెంగావి చీరెకట్టినట్లు కనబడేను. కొండల యందు ఘణాం ఘణాం మను శబ్దము వినబడేను. నానాటికి వింతలు హెచ్చేను. ఇంకను దేవరహస్యంబు లనేకంబులున్నవి. తల్లీ! ఈ వింతలన్నియు నేను వీరభోగ వసంతరాయుండనై కలియుగంబున వచ్చువరకు జరుగుచుండును. ఇకననేకంబులు జరుగును. ఇవియన్నియు పిమ్మట సావధానంబుగా దెల్పెద. నాకు భక్తులైనవారికి మోక్షంబు కరతలామలకముగా నుండును. నన్ను భక్తిలో నమ్మి నా కాలజ్ఞానంబును బూజించిన వారికిని, పురాణంబు జెప్పుకొనుచు వినువారికిని, చదువుగారికిని అష్టయిశ్వర్యంబులు సమకూరును. గాన నీవు సదా నన్ను ధ్యానించుచుండుము. నీకు బ్రహ్మత్వంబు సిద్ధించునని శ్రీ వీరప్పయాచార్యుల స్వాములవారు చెప్పగా, నా యచ్చమ్మగారికుండెడి మహదానందమునకు మేరలేక స్వామీ! ఇక గృహంబునకేగుదము రమ్మని స్వాములవారిని దోడ్కొని బనగానపల్లి జేరిరి. వీరిరువు రాకొండపై ముచ్చట లాడుట చేతనే ఆకొండ ఇప్పటికిని "ముచ్చట్లు" అని పిలువబడుచున్నది. అంత వీరప్పయాచారిగారు వ్రాయుచుండిన కాలజ్ఞానంబులన్నియు నాయచ్చమ్మగారి యింట నున్న నొక పాతర యందుంచెను. కొన్ని దినంబులు గడచిన పిమ్మట కాలజ్ఞానపు పాతరపైని పైని కొక చింతచెట్టు మొలిచెను. స్వాముల వారికి అచ్చమ్మగారు ఒక మఠంబును గట్టించెను. ఆ లోమఠంబునందే ఇరువురు నుండి తపంబు చేయుచు నుండిరి. అచ్చమ్మగారు సంసారంబును వీడి వైరాగ్యమానసియై ఆ స్వాముల వారిని సేవించుచు నాయనకడ నుండెను.
38. పోలేరమ్మతో బ్రహ్మంగారు నిప్పును తెప్పించుట
శ్రీ మన్మహీమండల భరతఖండంబున కడప జిల్లా బద్వేలు తాలూకా కందిమల్లయ్య పల్లెయందు "పోతులూరి వీరన్న" యను నామంబుతో చూచువారలకెల్ల వెర్రివానివలె కన్పించుచు వడ్రంగి వృత్తినే యాధారముగా జేసికొని ఆ గ్రామవాసు లొసంగెడి పనిముట్లు జేసి యిచ్చుచు నుండెను. తా నెప్పుడు చూచినను పని చేసినట్లుగా నా గ్రామవాసు లెవరును నెరుంగరు. ఆ పనిముట్లు నెప్పుడు చేసెదరోయని యనేకులు చూడ నుద్దేశించి ఎక్కువగా పనిముట్లను జేయుట కిచ్చి యాయన వద్దనే గూర్చుండెడివారు. ఎప్పుడు చూచినను నేవియో ప్రసంగముల జెప్పుచు కాలమును గడుపుచుండెను. కాని పనిని మాత్రం చేసినట్లు గాన్పించడు. తెల్లవారుదయముననే యెవరెవరి పనిముట్లను వారికిచ్చుచుండెను. కాని యాయన మహామహింబులను మాత్రం మా గ్రామవాసు లెరుంగక "వెఱ్ఱి వీరన్న" యని పిలుచుచుండెడివారు. ఆ గ్రామవాసు లందరును గ్రామ దేవతయైన పోలేరమ్మకు జాతరచేయు కుతూహలము గలవారలై శుభముహూర్తంబును నిశ్చయించిరి. కంది మల్లారెడ్డి యను గ్రామ పెద్ద తానే యన్ని ఖర్చులను భరించి జాతర చేయించెను. తెల్లవారి జాతరకైన డబ్బులు వసూలు చేయుటకై గ్రామ పెద్ద లందరును బయలుదేరి ప్రతి యింటికి వెళ్ళి సొమ్మును వసూల చేయుచు శ్రీ వీరబ్రహ్మంగారింటి కా పురవాసులందరును వచ్చిరి. "వీరన్నా! అమ్మవారి జాతరకైన ఖర్చులకు నీ వంతు ఇవ్వవలసిన డబ్బు ఇవ్వ"మని వచ్చిన పెద్దలోనొకరు అడిగిరి. అందుల కా వీరబ్రహ్మంగారు ఏమియు మాట్లాడక కొంచె మూరకుండి "నాయనలారా! నేనునూ డబ్బు ఇవ్వవలయునా? నేను చాలా బీదవాడను గదా! నన్ను మాత్రము వదిలివేయకూడదా?" యని స్వాములవారనగానే, వసూలై వచ్చిన పుర పెద్దలలో ఒకరు "నీ వెఱ్ఱివేషంబులన్నియు మాని యంద రెంతెంత యిచ్చిరో నీ వంతు డబ్బు కూడా ఇవ్వక తప్ప"దిని కోపంబుతో మాట్లాడగా, నంత స్వాములవారు మారు మాట్లాడక "నాయనలారా! వంతు యివ్వవలసిన డబ్బును మీ యిష్టాను సారంబుగ నిచ్చెదను గాని, అమ్మవారిని నిల్పిన పురంబుకడ కేగుదమ ర"మ్మని వారందరును కలిసి దేవతను నిల్పిన పురంబు వద్దకు వెళ్ళి రచ్చబండపై గూర్చుండిరి. శ్రీ స్వాములవారు పొగచుట్టను చుట్టుకొని చేత బట్టుకొని, అమ్మవారిని నిల్పిన పురంబువంక జూచి 'అమ్మా! పోలేరీ! నిప్పును తేవే' యని స్వాములవారనగానే యంత నమ్మవారదృశ్యరూపముతో నిల్పులుంచిన వైరాల మూకుడును తీసికొనివచ్చి స్వామి వారి చేతికచ్చి, యచ్చటనే యదృశ్యంబుగా నిలువంబడి యుండెను. స్వాములవారు ఆ నిప్పుతో చుట్టను గాల్చుకొని 'తల్లీ! తిరిగి నీ నిప్పును తీసికొని వెళ్ళు'మని స్వాముల వారనగానే తిరిగి అమ్మగారు దానిని దీసికొని వెళ్ళి యధాస్థానమందుండెను. ఆ వచ్చిన పురజనులందరును నాశ్చర్యంబు జెంది కరములు జోడించుకొని ఒకేసారి స్వాములవారి పాదంబులపైబడి శిరస్సాష్టాంగ దండప్రణామంబు లాచరించి "స్వామీ! నీ మహిమంబు దెలియక వెఱ్ఱిబత్తుండవనుకొని అపరాధము చేసి నారము గాన మహాత్మా! మే మిదివరకు జేసిన తప్పులన్నిటి నొప్పులుగా భావించి, మీ బిడ్డలమైన మమ్ములను గాపాడి, మా కందరకును బ్రహ్మజ్ఞానోప దేశమిచ్చి మమ్ములను ధన్యులను జేయు"డని యందరేక పర్యాయము వేడుకొనగా నంత స్వాములవారు కరుణించి "బిడ్డలారా! నన్ను మీరెరుంగక, అజ్ఞానాంధకారంబులో మునిగి తాపత్రయంబులకు బద్ధులై, యరిషడ్వర్గంబులకు లోనై యున్నవారలుగాన మీకు మహిమంబులు తెలియవు. నన్నెరుంగుటకు నందరికిని సాధ్యంబుగా"దని స్వాములవారు చెప్పగా నచ్చటనున్న పురజనులందరు వినయవిధేయులై పున: పున: ప్రమాణంబు లాచరించుచు "స్వామీ! మీరు భక్తి జ్ఞాన వైరాగ్యంబులను బోధించి, మమ్ములను ధన్యులను జేయు"డని వేడుకొనగా నంత స్వాములవారు కరుణించి "బిడ్డలారా! మీ స్థితి ఎలాగున్నదనిన 'అనేక పదార్థంబుల యందు దిరుగుచుండిన గరిటె యా పదార్ధముల రుచి నెట్లెరుంగదో అట్లే మీ పరిస్థితులను జూడ నా గరిటె మాదిరిగా నున్న"దని స్వాములవారు సెలవియ్యగా, నా పురజనులలో నొకరు లేచి స్వాములవారికి నమస్కరించి తండ్రీ భక్తి యనగానేమి? దానియందెట్లుండవలయును? అయ్యది విశదముగా దెల్పుడని వేడుకొనగా స్వామివారిట్లనిరి.
-- ఇంకా వుంది --
48. శ్రీ సిద్దయ్యగారి జననము, సద్దయ్య బ్రహ్మంగారి వద్దకు వచ్చుట, మఠంబునందు తపంబాచరించుచున్న స్వాములవారు భక్తులను వర్ణించుట
కందిమల్లయపల్లెకు ఎనిమిదిమైళ్ళ దూరంబునం గల "ముడుమాల"యను గ్రామంబున దూదేకుల వంశీయులైన పీరుసాహెబు, భార్య ఆదంబి యను దంపతులకు పుత్రసంతానంబులేమిచే యనేక ఉపవాసంబులును, మహమ్మదీయాచారంబున భగవంతుని పేర జండాలను యెత్తించుచూ మిఠాయిలను భగవంతునిపేర చదివించుచు సకల సద్గుణ సంపన్నుడైన యొక సుపుత్రుని దయచేయమని సర్వదా సర్వేశ్వరుని సర్వకాల సర్వావస్థల యందును ప్రార్థించుచు, నా గ్రామంబున కరుదెంచెడు వలీలు పైగంబరులు పకీరులు మొదలగు వారందరికి నతిభక్తితో క్షీర శర్కరాదు లొసంగుచు వారిచే దీవనలందుచు నుండిరి. ఇట్లుండ పరమేశ్వరానుగ్రహంబున నొక సుపుత్రుండుగల్గెను. ఆయనకు "సిద్దయ్య" యను నామకరణంబును జేసిరి. ఈయన పుట్టినప్పటి నుండియు తల్లిదండ్రుల సంతోషంబునకు మేరలేకుండెను.
శ్రీ సిద్దయ్యగారు దినదిన ప్రవర్థమాన రాకా శశాంకుని భంగి పెరుగుచుండెను. ఆ మహాభాగేయుని ఏడవ వత్సరంబున పాఠంబున పాఠశాలకు బంపిరి. ఆ పాఠశాలయందుండు నందరి బాలురకన్నను శాంతశమదాది గుణంబులు గల్గి సర్వదా సర్వేశ్వరధ్యానియై అందరి బాలురకన్నను విద్యయం దధక జ్ఞానుండైయుండి తల్లిదండ్రాదులను జీవహింస, అసత్యము, చోరత్వము, పరస్త్రీ గమనము, ఇరుగు పొరుగు వారిని ప్రేమించకుండుట, గోమాంస భక్షణ మాదిగాగల దుష్కార్యంబులు చేయకూడదని బోధించుచుండెను. అంత సిద్దయ్య గారి పల్కులకు తల్లిదండ్రులేగాక చూచెడి వారందరాయనను గౌరవించుచుండిరి. అప్పటికి సిద్దయ్యగారు పదిరెండు వత్సరముల ప్రాయము గలవాడయెను. తాను జన్నించి నప్పటి నుండియు పుట్టు బ్రహ్మజ్ఞాని యగుటచే తన చిన్నతనంబు నుండియే ఆర్యులనిన తన అఱ్ఱుబంచి నమస్కరించి పూజించుచుండు స్వభావముగలవాడు. చూచువారందరకును రెండన ప్రహ్లాదుడా! యనునట్లు తాను తోడి బాలురకు బోధించినను తాను మాట్లాడుచుండినను కేవల శాంతశమదమాదిగుణంబులు గలవాడై భక్తిప్రవత్తులతో మాట్లాడుచుండెడివాడు. ఆ సిద్దయ్యగారు పదునాల్గువత్సరంబులు రాగానే తాను మహమ్మదీయుడైనను నిర్మల మానసుండగుటచే సాంఖ్య, తారక, అమనస్కంబులను బోధించి సద్గతికి త్రోవను జూపెడి దేశిక శిరోరత్నంబెప్పుడు లభించునాయని యాలోచించుకొను సమయమున నా గ్రామంబునంగల సాధుల లందరా వీరబ్రహ్మేంద్రవారి సచ్చారిత్రము చెప్పుకొనుట తాను విని కేవల వైరాగ్య మానసుండై తల్లిదండ్రులను వదలి అదేదారిగా కందిమల్లయ పల్లెజేరి స్వాములవారి మఠం సింహద్వారమునకు నమస్కరించి లోనికేగి చూడగా నందుండు భక్తులాచరించెడి తపంబునుజూచి తన మనంబు మారి తన్మయుండై యుండి కొంత సేపటికి ధైర్యంబవలంబించి నా తపం బాచరించెడి భక్తాదులను, స్వాములవారిని యిట్లని వర్ణింపసాగెను. ఆహా! యేమి ఈ మఠంబులోనం బ్రవేశించినంతనే నాదక్షిణ నేత్రం బదురుచున్నది. శ్రీ స్వాములవారి దర్శనం బైనంత మాత్రంబుననే నా శరీరం బంతయు బులకాంకురంబును జెందుచున్నది. ముందేమి కానున్నదో దెలియదు. ఈ మఠంబును జూడగా రెండవకైలసమా యనునట్లున్నది. శ్రీ స్వాములవారిని జూడ అపరశివునివలె నున్నారు. తక్కిన భక్తాదులందరిని చూడ దేవగణమో యని తోచుచున్నది. ఇచ్చట నింకను అనేక తపోధనులైన మహాత్ములు సిద్ధాసన, సింహాసన, భద్రాసన, గోముఖాసన, స్వస్తికాసన, ప్రముఖాసనాదిగా గల రేచక పూరకకుంభక ప్రాణాయామంబులు చేయువారును ఆధార స్వాధిష్ఠాన మణిపూరక అనాహత విశుద్ధ ఆగ్నేయ చక్రంబుల యందున్న పంచాశద్వర్ణంబుల యందున్న పంచాశద్వర్ణంబుల నిరీక్షించుచు తదీయాధిష్ఠాన దేవతలను జప విధానంబుగా నర్చించుచు నాడీశోధనంబు జేసి క్రమ క్రమంగా షడాధారంబుల చేధించి సుషుమ్న నాడీ మార్గంబున నూర్ధ్వముఖంబుగా సహస్రార కమలాంతర సుధాబిందు పానానుభవంబున సొక్కుచుండువారునుహృదయకమల కర్ణికా మధ్యంబున సంగుష్ట మాత్రుండై ప్రకాశించచున్న పరమాత్ముని ధ్యానించి తదనుభవంబున నానందించువారును సాంఖ్యతారక అమనస్క యోగాభ్యాస పరవశులై యంతర్లక్ష్య, మధ్యర్లక్ష్య, బాహ్యర్లక్ష్యాప లోకనంబుజేయు వారును శ్రోత, నేత్ర, నానాపుట నిరోధనంబుజేసి యాత్మ ప్రత్యయ ప్రకారంబు గాంచుచు దశవిధ నాదంబు లాలకించు వారును అంతర్లక్ష్యంబునుండి అరకంటి చూపున స్వరూప ధ్యానము జేయువారును, కన్నులుమూసి శిరంబును వంచి యూర్థజ్ఞప్తి గళా మాత్రంబున నిల్చువారును, ఇదమిద్దమనుట మరచి యెరుక మాత్రమే శేషించి కేవలాత్మానుభవంబు జేయువారును, స్థూలజిహ్వాగ్రంబును తదుపరిసూక్ష్మ జిహ్వాగ్రంబు దాకునట్లుగా జొనుపును తదేకనిష్టలచే లంబికా యోగాభ్యాసంబు చేయువారును, నివ్విధంబున ధ్యానషణ్ముఖి శాంభవి రాధాయంత్ర ఖేచరీముద్రా భ్యాసపరులై యోగానుష్టానపరులైనవారను, యేక పాదస్థులై యధోమండలవర్తియైన శ్రీమన్నారాయణుని వర్ణించువారును, పంచాగ్ని మధ్యమునందుండి మహా ఘోరతపం బాచరించువారును, రామతారకంబును, నారాయణాష్టాక్షరంబును శుద్ద ప్రణవ మంత్రంబులాదిగా గల యేడుకోట్ల మహామంత్రంబుల అంగన్యాస, కరన్యాస పూర్వకంబుగా ఏకాగ్రచిత్తంబున దపంబు చేయువారును, శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామిని ధ్యానించుచు షోడశోపచారంబులచే పూజలు సల్పువారును, దన్నామ మంత్రంబులను జపించువారును, వ్యాఘ్రాజిన కృష్ణాజిన వల్కలాంబరులై వాతంబువర్ణ కందమూల ఫలాశనులై వర్తించుచు నిట్లనేక విధంబుల కర్మ, భక్తి, జ్ఞాన, వైరాగ్య, జప, తప, హోమాది సకల సత్కర్మ నిష్టులైయున్న తపోధనుల మధ్యంబున ప్రణవ సింహాసనా సీనుండై నక్షత్ర మధ్యంబున వెలుంగు చంద్రుని చందంబున బాల సూర్య కాంతులతో శోబిల్లెడి శ్రీ వీరబ్రహ్మేంద్రస్వాములవారిని సిద్ధయ్యగారు చూచి తన్మయత్వంబును జెంది దేహమును మరచి కొంతసేపటికి జ్ఞప్తిగలిగినంత సిద్ధయ్యగారు శ్రీ స్వాములవారి పాదంబులపైబడి శిరిస్సాష్టాంగ దండప్రణామంబులాచరించి నిలువంబడి శ్రీమద్రాజాధిరాజ రాజపరమేశ్వర శ్రీ మద్విరాడ్విశ్వకర్మ కులోద్భవ బ్రహ్మాండపురవాస పరిపూర్ణయాచార్య ప్రకృతాంబగర్భ శుక్తి ముక్తాఫల అవతార మూల ద్వాదశమధ్యే వేదాంత జ్వాలబింబాయమాన నాదబిందు కళాతీత సందర్శన ఉత్తరశాంభవీ అమనస్క యోగనిష్టాగరిష్ట అఖండమండలాకార సచ్చిదానంద మహాప్రణవ పంచాక్షరీ అవిరళ పరంజ్యోతి ప్రణవ స్వరూపులయిన స్వామీ! సద్గురు ప్రభో! సకల పాప విధ్వంసకా! సచ్చిదానందరూపా! సద్గురు స్వామీ! సకల భువనాధారా! సర్వేశ్వరా! సద్గురు సార్వభౌమా! సకల భూతాంతవ్యాపకా! సద్గురు చంద్రమా! నన్ను తమ పాదరేణువుగా జూచి శిష్యునిగా జేసుకొనుమని ప్రార్థింపనంత స్వాములవారు శీఘ్రమేవానంద ప్రాప్తిరస్తు అని దీవించగా సిద్దయ్యగారు శ్రీ స్వాములవారి పాదంబుల కడనే కూర్చుండి స్వాములవారి పాదసేవ చేయుచుండెను.
66. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సిద్దయ్యగారికి సాంఖ్య యోగంబును బోధించుట
శ్రీ స్వాములవారు నిర్గుణ సమాధినుండి మేల్కాంచిన పిమ్మట శ్రీ సిద్దయ్యగారు స్వాములవారి పాదంబులకడ గూర్చుండి పాదంబులొత్తుచు స్వామీ! సద్గురు చంద్రమా! ఈ ప్రపంచంబంతయు నెట్లుగల్గెనో తెల్పుమని ప్రార్ధించగా అంత స్వాములవారు సిద్దయ్యగారిని జూచి నీవు నాకు జ్ఞానపుత్రుండవని నమ్మితిగాన నేను నీకు జెప్పబోవు సాంఖ్య బోధనయేమనగా ముందు విశ్వసృష్టియు పంచభుత విమర్శన మనియు పంచీకరణంబనియు దేహతత్వ విచారణ యనియు జెప్పబడును. కాన నీవు త్రికరణ శుద్దిగలవాడవై వినుము. ఈ కనిపించుచున్న ప్రపంచమంతయు నెక్కడ పుట్టెనో చెప్పెద వినుము. సృష్టికంటెను పూర్వమందు నాశము లేనట్టియు, వికారము లేనట్టియు, కాలత్రయంబులందున బాధింపబడనట్టియు, సృష్టికి అభిముఖమైనట్టియు, నిత్యనిర్మల నిర్వికార నిరామయ నిర్గుణ సర్వాత్మక సత్య స్వరూపమైనట్టిది సృష్టికంటెను పూర్వమందు ఒకటి యున్నది, రెండవదిలేనిది, అదియే బ్రహ్మమని చెప్పంబడును. దానియందు అది లేనిదై నిరాకారమైన దైవసృష్టిని జేయుటకు సామర్ధ్యము గలదై ప్రధానమను పేరుగల ప్రకృతి యను నొకటి గలదు. ఆ ప్రకృతియందు పైన జెప్పంబడిన నిర్వికార ధర్మములు గలిగినట్టి బ్రహ్మముగలసి ఈశ్వరుండనియు లేక అవ్యాకృతుండనియు పేరుగలిగెను. ఆ ఈశ్వరునియందు హిరణ్యగర్భుడు లేక సృష్టికర్త యనువాడు పుట్టెను. ఆ హిరణ్యగర్భునియందు విరాట్టు లేక వైశ్వానరుండును గల్గెను.
శ్లో|| బ్రాహ్మణోరవ్యక్తాన్ అవ్యక్తాన్ మహత: |
మహతోయ మహంకారో పంచతన్మాత్రాణి పంచతన్మాత్రేభ్యో
పంచమహా భూతాని పంచమహాభూతేభ్యో-ఖిలంజగత్||
తా|| విరాట్టునందు మహత్తు, నా మహత్తునందు అహంకారము, నా యహంకారమునందు పైని జెప్పంబడిన ప్రకృతి సత్వరజోతమోగుణంబులు గలిగి విభాగంబును గలదాయెను. ఆ ప్రకృతియొక్క సత్వగుణమందు జ్ఞానేంద్రియములు, రజోగుణమువలన కర్మేంద్రియములు, తమోగుణంబువలన వాటి విషయంబులు, ఆ జ్ఞనేంద్రియముల వలన ఆది దేవతలతో కూడిన పంచ మహాభూతంబులు బుట్టెను. అనగా
1) శబ్దము వలన సదాశివుం డధిదేవతగా గల్గిన యాకాశంబు పుట్టెను.
2) స్పర్శము వలన నీశ్వరుండు అధి దేవతగా గల్గిన వాయువు పుట్టెను
3) రూపము వలన రుద్రుడధిదేవతగా గల్గిన అగ్ని పుట్టెను
4) రసము వలన విష్ణు డదినేతగా గల్గిన జలంబు బుట్టెను
5) గ్రంధమువలన బ్రహ్మ అధిదేవతగా గల్గిన భూమిపుట్టెను.
పైని జెప్పబడిన పరమేశ్వరుడు ఈ విధంబుగా సూక్ష్మసృష్టిని బుట్టించి, స్థూలసృష్టికై తిరిగి సంకల్పించెను. పైన జెప్పంబడిన పంచ మహాభూతములను ఒక్కొక్క భూతమును తక్కిన భూతములతో గలిసినప్పుడు 'పంచీకరణ' మాయెను. అనగా ఆకాశమును రెండు భాగములు చేసి అందులో ఒక భాగము సమిష్టి భాగముగాను జేయవలయును. ఈ విధంబుననే ప్రతి భూతమును విడదీసి పంచినయెడల యిరువదియైదు తత్వంబులగును. ఈ యిరువది యైదుతత్వంబు లెవ్వియనగా
(1) జ్ఞాన, మనో, బుద్ధి, చిత్త, యహంకారంబులను అంతరేంద్రియములైదును
(2) సమాన, వ్యాన, ఉదాన, ప్రాణ, అపానంబులను పంచప్రాణంబులను
(3) శ్రోతము, త్వక్కు, చక్షువు, జిహ్వా, ఘ్రాణములనెడి జ్ఞానేంద్రియములైదును
(4) వాక్కు, పాణి, పాదము, గుదము, గుహ్యములనెడు కర్మేంద్రియంబులైదును
(5) శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము లనియెడి పంచతన్మాత్రలును నీ యిరువదియైదు తత్వంబులచే నీ స్థూలంబాయెను.
ఈ స్థూలశరీరండైన జీవుండు అతని పేరు విశ్వుడు. కాన నీ యిరువదియైదు తత్వంబులదు అధి దేవతలను జెప్పెద వినుము.
(1) జ్ఞాన మనో బుద్ధి చిత్త యహంకారంబు లనెడి ఆకార పంచకంబునకు క్షేత్రపాలకుడు చంద్రుడు, బ్రహ్మ విష్ణు రద్రుడును అధి దేవతలైరి.
(2) సమాన, వ్యాన, ఉదాన, ప్రాణ, అపానంబులను వాయు పంచకంబునకు విజయుడు జయుడు విశ్వయోని విససృష్ణుడు విశ్వకర్మలును అధి దేవతలైరి
(3) శ్రోతముత్వక్కుచక్షుజిహ్వాఘ్రాణంబులనియెడి అగ్ని పంచకంబునకు అష్టదిక్కులు, వాయువు, సూర్యుడు, వరుణుడు, అశ్వనీదేవతలు అధిదేవతలైరి
(4) వాక్కు పాణి పాదము గుదము గుహ్యంబులనియెడి పృధ్వీపంచకంబునకు అగ్ని దేవేంద్రుడు విష్ణువు బ్రహ్మ మృత్యువు అధి దేవతలైరి
(5) శబ్ద స్పర్శ రూప రస గంధము లను జలపంచకమునకు ఆదిశక్తి యిచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి పరాశక్తి యును అధిదేవతలైరి.
దేహత్రయముల వివరము ఈ యిరువదియైదు తత్వములచే గూడినదే "స్థూలదేహ" మనంబడును. జ్ఞనేంద్రియంబు లైదును, కర్మేంద్రియంబులు ఐదును, పంచప్రాణంబులు నైదును, మనోబద్ధులు రెండును కలిపి పదిహేడు తత్వంబులచే గూడినదే "సూక్ష్మదేహ" మనంబడును. దీనినే "లింగదేహ" మనియును జెప్పుదురు. స్థూల సూక్ష్మదేహములు రెండున్నూ కార్యరూపములుగా నున్నవి. పొగ వచ్చుటచేతను నగ్నిని జూడకున్నను కారణమగు యగ్ని యున్నందుననే దాని కార్యరూపమగు పొగ వచ్చుచున్నదని నిశ్చయించవచ్చును. అదియే అజ్ఞానస్వరూపమగు "కారణశరీరము." నేను అజ్ఞానిని అనుట వలన అజ్ఞానము ప్రత్యక్షముగానున్నది. అజ్ఞానమే కారణశరీర మనంబడెను. ఆ యజ్ఞానంబుననే స్థూల శరీరంబులు గల్గుచున్నవి. ఎట్లనిన
శ్లో|| అజ్ఞానాదవివేక:| అవివేకా రభమాన:| అభిమానాద్రాగాదయ:| రాగాదయ: కర్మాణి, కర్మాణిశరీరపరగ్రహాని||
తా|| అజ్ఞానమువలన అవివేకమున్ను అవివేకంబువలన నేను నాది అను అభిమానమున్నూ, అభిమానమ వలన కామక్రోధాదులున్నూ, కామక్రోధాదుల వలన అనేక కర్మల చేయుచు కర్మవశమున నీ జీవాత్మ జనన మరణములన బొందుచు మరల పూర్వకర్మవశమున బుట్టుచు చచ్చుచు నిట్లనేక జన్మంబు లెత్తుచు దు:ఖించుచుండును. అజ్ఞానంబను కారణదేహము నశించకున్న ముక్తిలేదు.
శ్లో|| తదావిద్వాన్ బ్రహ్మజ్ఞానాగ్ని నా కర్మబంధం నిర్గమై:
తా|| బ్రహ్మజ్ఞానాగ్ని వలన అజ్ఞానమున్నూ సకల కర్మలున్నూ నశించి జీవుండు ముక్తిని బొందును. అజ్ఞానంబను కారణదేహము నశించెడి ఈ రూపంబును ప్రతిమానవుండును గ్రహించవలెను. లేకున్న ముక్తిలేదని స్వాములవారు బోధించగానంత సిద్ధయ్యగారు స్వామీ! దేవరవారి కృపాకటాక్షంబుచే తారకసూత్రంబెరిగించిరి. తిరిగి యిప్పుడు సాంఖ్యసూత్రం బెరిగించితిరి కాని యీసాంఖ్యసూత్రం బింతియేనా? లేకనింక నేమయినా తత్వంబులుగలవా? యని యడుగగా నంత స్వాములవారు బిడ్డా! నీమనోపరిపక్వంబునుజూడ సంతసం బయ్యెను. వినుము
శ్లో|| పంచైతాని, దశేంద్రియాణి, విషయా:, ప్రాణాశ్చషట్ చక్రయా, రాగాష్టాకరుఢా చతుష్షడూర్ముభి: సప్తాని తద్ధాతవ: నాడీ, మండల, మీషణత్రయ, గుణావస్థాశ్చ తాపత్రయం| కోశా, పంచ తనుశ్చ షన్నతికం తత్వాని జీవాత్మనా||
తా|| ఇవియే తొంబదియారు తత్వములు. పంచభూతంబులు 5 న్నూ, జ్ఞానేంద్రియంబులు 5 న్నూ, కర్మేంద్రియంబులు 5 న్నూ, విషయంబులు 10 న్నీ, ప్రాణాది వాయువులు 10 న్నీ, చక్రములు 6 న్నూ, రాగములు 8 న్నీ, అంత:కరణములు 4 న్నూ, షడూర్ములు 3 న్ను, ఈషణములు 3 న్ను, గుణములు 3 న్ను, అవస్థలు 3 న్ను, తాపత్రయములు 3 న్ను, కోశములు 5 న్ను వెరశి 96 తత్వములు. ఈ తత్వములతో గూడిన నీశరీరమే నేననువాడు "జీవుండని" యెరుంగుము. ఇంకను నీ ఘటప్రమాణంబునుం జెప్పెద.
ఘటవిమర్శన - ఈ ఘటము 9 అంగుళములప్రమాణంబు గలది. 7 జానల పొడవున్ను, 4 జానల వలయముఉ 23 కోట్ల రోమద్వారంబులున్ను, 30 మూరల ప్రేగులన్నూ, 92 సంధులున్నూ, 70 ఎముకలును, 8 ఫలములగుండెయున్ను, 40 ఫలముల రక్తమున్నూ, 360 ఫలంబుల మాంసమున్ను సోలెడు పైత్యమున్ను, అరసోలెడు శ్లేషమున్ను, సోలెడు శుక్లంబును నిన్నింటితో గూడినదే యీ స్థూలశరీరము. ఇదే "అనాత్మ"ను అనుజ్జడ దు:ఖస్వరూపమయిన యీ దేహము తానను అజ్ఞానమే జీవాత్మ. ఇట్టి దేహముకన్నను విలక్షణమైన "ఆత్మే" తానని యెరుగుట "జీవన్ముక్తి"యని స్వాములవారు బోధించగా, సిద్దయ్యగారు బ్రహ్మానందమున నోలలాడి పరవశుడై, స్వామీ! సద్గురుప్రభూ! మలమూత్రాదులచే నిండిన నీ యేహ్యంబైన శరీరంబున దేవతలున్నారని మొదటి దినంబు బోధించితిరే! వారు యే ఏ స్థానంబులలోనుందురని యడుగగ, నంత స్వాములవారు బిడ్డా! వినుము. ఈ దేహంబున ఆధార స్వాధిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆజ్ఞేయంబులను నారు చక్రంబులు గలవు. ఒక్కొక్క చక్రంబునంగల దళంబులున్నూ, బీజంబులున్నూ, లింగములున్నూ, అధిదేవతలున్నూ, వర్ణములున్నూ, స్థానంబులున్నూ, శక్తులున్నూ, హంసలున్నూ తెల్పెద జాగరూకుడవై వినుము
107. శ్రీ స్వాములవారు "ఎరుక" యిట్టిదని దెల్పి దాని ప్రభావంబును బోధించి, పిమ్మట "పరిపూర్ణమును" బోధించుట
శ్లో||
ఇంద్రజాల మిదం సర్వం యధా మరుమరీచికా!
అఖండిత మనాకారం వర్తతే కేవలం శివం||
అని శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవునకు బోధించిన భావా భావాతీతంబయిన పరిపూర్ణ భావంబును బోధించెద చక్కగా వినుము. నామరూపంబులుగల నీ ప్రపంచం బంతయు ఇంద్రజాల మను మాయవలన దోచుచుండును. ఎట్టులనిన నిర్జన భూమియందు నీరున్నటుల దోచుచుండును. ఈ గాన్పించుచుండిన చరాచర ప్రపంచంబంతయు మాయ. మాయయే భ్రమ. భ్రమ నాశనమే సంకల్పవర్జితం. ఏడు ఏడు పదునాల్గు లోకంబులున్ను మాయ. ప్రకృతి పురుషులు మాయ. క్షేత్రక్షేత్రజ్ఞులు మాయ. సుఖదు:ఖంబులు మాయ. అనుభవంబనియందురేగాని నదియు మాయయే. ఈ మాయకు మూలము లేదు. ఆకాశంబున గాన్పించెడి మెరుపువలె గానంబడి రెప్పపాటులో మాయం బగును. మూలము లేనటువంటి నీ మాయయే యనేక విధంబులుగా గానంబడి కష్ట సుఖంబులను బోధించుచుండును. ఇక భావా భావాతీతమే అచల పరిపూర్ణము. సర్వదా సందులేక నిండి నిబిడీకృతంబై నిండిన నీ యచల పరిపూర్ణం బిట్టిది యనియు అది తప్ప మరేమియు లేదనియు మనంబున నిశ్చయించుకొని ఆరూఢజ్ఞానియై యుండుటే పరిపూర్ణమును దర్శించుట. అదియే విశ్రాంతి మార్గము. జనన మరణములకు హేతువులైన బంధ మోక్షంబులు విశ్రాంతికి మార్గములుగావు. ఇవి యన్నియు ప్రకృతి బంధములైన మాయ కల్పితంబులు. బుద్ధిమంతులయినవారలు దీనిని విసర్జింతురని మాయ సంబంధమైన "యెరుక" ప్రభావంబును జెప్పగా నంత సిద్దయ్యగారు మహాత్మా! నాకు జనన మరణ రహితంబయిన అచల పరిపూర్ణ భావంబును బోదించి నన్ను జనన మరణ ప్రవాహమునుండి తొలగించుడని వేడగా బిడ్డా! నీవు జాగ్రత్తగా విని యా అచల పరిపూర్ణమును దెలియుమనెను. బిడ్డా! భావాభావముల కగోచరంబైనదే అచల బ్రహ్మము. దానినే అచల పరిపూర్ణమందురు. ఈ గాన్పించెడి సచరా చరంబంతయును నిండి నిబిడీకృతంబై ముల్లు గ్రుచ్చుసందులేక నంతా తానైయున్నదే అచల పరిపూర్ణము. షడ్ వికారంబులు లేని దేహరూపనామ క్రియా రహితంబైనది. పుట్టు గిట్టుటలు లేనిది. అయ్యది స్త్రీయునుగాదు, పురుషుడును గాదు, నపుంసకముగాదు. ప్రకృతి యున్నదనిగాని, లేదనిగాని, నది యెప్పటికిని నెరుంగదు. మహాసముద్రమువలె నిండియుండు పరిపూర్ణాచల సముద్రమును జూడుమని ద్వాదశాక్షరీ మహామంత్రమును బోదించి ఇయ్యదియే "పరిపూర్ణం"బని సౌంజ్ఞ జేసి నిశ్శబ్దంబుగా నూరకుండెను. అంత సూక్ష్మగ్రాహియైన సిద్దయ్యగా రా సౌంజ్ఞను గ్రహించి పరిపూర్ణమును దర్శించి నిశ్చేష్టితుడై నిలచినంజూచి స్వాముల వారు బిడ్డా! నీ నిజరూపంబును దర్శంచితివి గదా! ఇదియే పరమ పదము. అయ్యదియే అచల పరిపూర్ణము. దీనినే బట్టబయలందురు. ఈ బట్టబయలు కన్న మరేమియు లేదు. దీని చేత ప్రకృతి పురుషులు బుట్టనేలేదు. ప్రకృతి పురుషులు రెండునుమాయ. మాయ యనగా భ్రాంతి. భ్రాంతిచేతనే నీ సర్వంబును దోచుటబట్టి ప్రకృతి పురుషులు రెండును లేనివి. ఈ లేని మాయా స్వరూపములయిన ప్రకృతిద్వయమే భావాభావంబులును వీటి కతీతంబును నీ రెండింటిని గుర్తెరుగుటం బట్టి ఎరుక యను పేరుగల్గెను. అట్టి యెరుకకు మూలంబేదియనిన మాయయే. మేఘమందలి మెరుపువలెను, సూర్యకిరణంబుల యందలి నీలంబువలెను, యెండమావుల యందలి నీళ్ళవలెను, త్రాటియందలి సర్పంబు వలెను గానంబడి మటుమాయంబై పోవుచుండును. ఈ వట్టి యెరుకయొక్క సంకల్పంబుచే గల్గినవే మోక్షాదిపదవులు. లోక భ్రాంతులు, మంత్ర భ్రాంతులు నవియన్నియు హుళక్కి. ఈ ప్రకృతి ద్వయంబయిన యేనుంగులు, గుర్రంబులు, స్త్రీలు తమకు తామేవచ్చినెల్ల సంభాషణంబులు సల్పి జాగ్రత్తకు రాగానే యెటులమటు మాయంబుగా బోవునో యటువలెనే నామరూపంబుగల సర్వంబును మటుమాయంబుగా బోవుటకు సందియంబులేదు. నీ కల్ల ఎరుకను నమ్మబోకుము... ఇంద్రజాలము భంగి గానుపించి చివరకు నేమియు లేకపోవును. నీ శరీరమునకు మూలములేదు. అతి ఏహ్యంబయి అసత్యంబైన నీ శరీరంబును నమ్మబోకుము. దీనియందలి బ్రమను విడువుమని షోడాక్షరిని బోధించి బిడ్డా! లేని యెరుకే చిత్తు, సత్తు, ఆనందస్వరూపముగాగల సచ్చిదానందము. ఈ యెరుకే నాదబిందు కళలు. నీ యెరుకే నాపోజ్యోతి. ఈ లేనియెరుకే నానావిధంబులుగా భ్రమలు పుట్టించుచున్నది. మూలములేని గుర్తెరిగే శరీరము నీవని నమ్మవద్దు. నీ నిజస్వరూపంబైన ద్వాదశాక్షరియే శాశ్వతమైనది, సత్యమైనది, అదియే శ్రీగురువాక్యము. ఇంతకన్నను, వేరొండు మహావాక్యంబు లేదు. నీ గురువాక్యంబును నమ్మకుండిన జనన మరణంబులు విడువనేరవని సంపూర్ణబోధను జేయగా నంత సిద్ధయ్యగారు స్వాములవారి పాదములపై తన శిరంబు వంచి స్వామీ! తమ దివ్యానుగ్రహంబున్న నాకే కొరతలు గలుగనేరవు. నెన్నికష్టంబులు వాటిల్లినను నేమియు జేయంజాలవని వేడగా నంత స్వాములవారు సిద్ధయ్యగారి శిరంబుపై హస్తముంచి "మనోవాంఛాఫలసిద్ధిరస్తు" అని దీవించెను.