Sunday, March 18, 2018

దేశంలోనే హైదరాబాద్ ఫస్ట్..! దేంట్లో ? ఇక్కడే అత్యధికంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు డయాబెటిస్ రోగులు ఉన్నారు


దేశంలోనే హైదరాబాద్ ఫస్ట్..!

హైదరాబాద్ : కిడ్నీ, గుండెపోటు, కీళ్లనొప్పులు, కాలెయ తదితర సమస్యలు వచ్చి అనారోగ్యానికి గురై చికిత్స తీసుకునేందుకు వైద్యశాలలకు వెళితే తప్ప బాధితులకు షుగర్ ఉన్నట్లు తెలియడం లేదు. దీనివల్ల చాలా మంది రోగులు మొదటి మూడు దశలు దాటి డేంజర్ జోన్‌లోకి వచ్చేస్తున్నారు. వ్యాధి ప్రారంభ దశలో అంటే మూడు స్టేజీల్లోగా ఉంటే దానిని నియంత్రిచవచ్చు. వ్యాధి వచ్చే అవకాశాలుంటే ముందుగానే గుర్తిస్తే అరికట్టవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.

80 శాతం మంది రోగులు మూడు దశల తరువాతనే వ్యాధి ఉన్నట్లు తెలుసుకుని ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా మధుమేహానికి మనదేశం ప్రపంచ రాజధానిగా మారింది. ఇతర దేశాల కంటే ఇక్కడే అత్యధికంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. అందులోనూ హైదరాబాద్ నగరం అగ్రగామిగా నిలవడం ఆందోళనకరం. దేశంలోని ఇతర నగరాల కంటే గ్రేటర్‌లోనే మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య ఎక్కువగా నమోదవుతున్నట్లు వైద్య, ఆరోగ్య సంస్థల గణాంకాల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం దేశంలో 70 మిలియన్ల మంది మధుమేహంతో బాధపడుతుండగా, ఒక్క హైదరాబాద్‌లో 20 శాతం ఉన్నట్లు నేషనల్ అర్బన్ డయాబెటీస్ జరిపిన సర్వేలో వెల్లడైంది. అయితే, అవగాహన లేమితో ఈ బాధితుల సంఖ్య ఏటేటా పెరిగిపోతున్న తెలుస్తోంది.
షుగర్ వ్యాధి ఎలా వస్తుంది?

షుగర్ అనేది శరీరంలో మూడు రకాల పదార్థాలు పెరగడం వల్ల వస్తుంది. అవి గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్. వీటినే సాధారణంగా చక్కెరలుగా పిలుస్తారు. ఈ పదార్థాలు మనం తినే ఆహారంలో ఉండి తీపిదనాన్ని అందిస్తాయి. సాధారణంగా శరీరం పలు రకాల సంక్లిష్ట పిండి పదార్థాలను గ్లూకోజ్‌గా మారుస్తుంది. అయితే, రక్తంలో ఉండే గ్లూకోజ్ స్థాయి పెరగడంతో ప్యాంక్రియాటిక్ బీటా కణాలు ఇన్సూలిన్‌ను విడుదల చేస్తాయి. విడుదలైన ఇన్సూలిన్ సమక్షంలో బీటా కణాలు శక్తిని ఉత్పన్నం చేయడానికి గ్లూకోజ్‌ను వినియోగించుకుంటాయి. ఇక ఫ్రక్టోజ్ విషయానికి వస్తే ఇది పండ్లు, తీపి పానియాలు, చల్లని పానియాల్లో లభిస్తుంది. ఫ్రక్టోజ్ వల్ల ఊబకాయం, కాలేయంలో కొవ్వు, ఇన్సులిన్ నిల్వలు పెరుగుతాయి. సుక్రోజ్ మనం వినియోగించే సాధారణ చక్కెర. ఇది చెరుకు నుంచి తయారవుతుంది. ఇందులో గ్లూకోజ్, ఫ్రక్టోజ్‌లు ఉంటాయి. ఈ మూడు పదార్థ్ధాలు ఒక గ్రాముకు సమాన మోతాదులో క్యాలరీలను అంటే శక్తిని విడుదల చేస్తాయి. శరీరంలో అధికంగా శక్తి విడుదలవడంతో అది కొవ్వుగా మారి రక్తంలో పేరుకుపోతుంది. ఫలితంగా శరీరంలోని ప్రధాన భాగాలైన గుండె, కిడ్నీలతోపాటు కండరాలకు రక్తం సరఫరా సన్నగిల్లుతుంది. అంతేకాకుండా కొవ్వు పెరిగిపోవడంతో ఊబకాయం కూడా ఏర్పడుతుంది. శరీరంలో తీపి పదార్థ్ధాల వల్ల అధిక శక్తి విడుదలవుతున్నందున ఈ వ్యాధిని చక్కెర లేదా మధుమేహ వ్యాధి అంటారని అపోలో వైద్యశాల ఎండ్రోక్రినాలజిస్టు డాక్టర్ రబీంద్రనాథ్ మెహ్రోత్రా, యశోద వైద్యశాల నిపుణుడు సీనియర్ ఎండ్రోక్రినాలజిస్టు డాక్టర్ కిషోర్‌కుమార్ తెలిపారు.
మధుమేహం నిజంగానే స్వీట్ పాయిజన్

పేరులోని తీపిదనం ఉంది. కానీ, ఇది తియ్యటి విషంలా మనిషి ప్రాణాలను తీస్తుందని యశోద ఆసుపత్రి వైద్యనిపుణుడు సీనియర్ ఎండోక్రైనాలజిస్టు డాక్టర్ కిషోర్‌కుమార్, డాక్టర్ రబీంద్రనాథ్ మెహ్రోత్రా వివరించారు. ఎందుకంటే ఈ వ్యాధి ప్రారంభం నుంచి తీవ్రమయ్యే వరకూ శరీరంలో ఎలాంటి ఇబ్బందులు అనిపించవు. ఫలితంగా వ్యాధిని రోగి గుర్తించే వీలు ఉండదు. ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే వ్యాధి బట్టబయలవుతుంది. అంటే రోగికి ఏదేని తీవ్రమైన అనారోగ్య సమస్య వచ్చినప్పుడు గాని, లేదా శస్త్రచికిత్సలు చేసే సమయంలో గాని వ్యాధి బయటపడుతుందని వైద్యులు పేర్కొన్నారు. అంటే వ్యాధి బయటపడే సమయానికి జరగరాని నష్టం జరిగిపోతుందన్నమాట. అందుకే దీన్ని వైద్య పరిభాషలో స్వీట్ పాయిజన్‌గా పరిగణిస్తారని వైద్యులు తెలిపారు.
డయాబెటిస్ ప్రభావం చూపే అవయవాలు

గుండె,  కిడ్నీలు, కళ్లు,కీళ్లు,కండరాలు, నరాలు,ఊపిరితిత్తులు
వ్యాధి లక్షణాలు

 ఎక్కువ ఆకలి వేయడం
త్వరగా నీరసించిపోవడం
ఎక్కువ మూత్రం రావడం
ఎక్కువ దాహం వేయడం
 బరువు తగ్గిపోవడం
గాయాలు త్వరగా మానకపోవడం
చూపు మందగించడం


No comments: